హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిధులు విడుదల చేయలేక ఏకంగా ఈ పథకాన్ని అటకెక్కించాలని సర్కారే నిర్ణయించినట్టు సమాచారం. ఈ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వ పెద్దలే తమతో చెప్పినట్టు పాఠశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 34వేల మంది దళిత, గిరిజన విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం కానున్నది. వారితోపాటు భవిష్యత్తులో ఆ వర్గాల బాలలు కార్పొరేట్ విద్యకు దూరం కానున్నారు. బకాయిలు విడుదల చేయాలని దీర్ఘకాలంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా, కులసంఘాలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో పథకం నుంచి వైదొలిగేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టర్లకు 10 రోజుల క్రితమే నోటీసులు అందజేశాయి.
17 ఏండ్లుగా అమల్లో బీఏఎస్
ఎస్సీ, ఎస్టీలైన చిన్నారులకు ఉచిత ప్రైవేట్, కార్పొరేట్ విద్యను అందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకకాన్ని అమలు చేస్తున్నారు. గత 17 ఏండ్ల నుంచి ఈ పథకం రాష్ట్రంలో అమలవుతున్నది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా నోటిఫికేషన్ జారీచేసి, విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులను అదే జిల్లా పరిధిలోని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తారు. ఈ కోటాలో ఎంపికైన వారికి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు 1వ, 5వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఏటా రూ.28,000, ప్రాథమికోన్నత స్కూళ్ల విద్యార్థులకు (వసతితో కలిపి) రూ.42,000 చెల్లిస్తున్నారు. అడ్మిషన్ పొందిన పాఠశాలల్లోని ఫీజులను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా రీయింబర్స్మెంట్ చేస్తారు. ఈ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ కలిపి 34 వేల మంది పూర్తి ఉచితంగా విద్యావసతి పొందుతున్నారు. ఈ స్కీమ్ పరిధిలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తోపాటు ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లు కూడా ఉన్నాయి.
218 కోట్లు బకాయిలు
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర నిధులు చెల్లించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 28 నెలల కాలంలో ఈ పథకం కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫలితంగా రూ.218 కోట్ల నిధులను ప్రభుత్వం బకాయి పెట్టింది. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాఠశాలలు నడుపలేమని, విద్యార్థులను ఈ స్కీమ్ కింద చేర్చుకోబోమని ప్రభుత్వానికి మొరపెట్టుకోవడమే కాదు, ఒకానొక దశలో లబ్ధిదారులైన దళిత, గిరిజన విద్యార్థులను పాఠశాలలకే అనుమతించలేదు. తీవ్ర విమర్శలు ఎదురవడంతో ఎట్టకేలకు సర్కార్ స్పందించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క బకాయి నిధుల్లో రూ.183 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. నిధులు విడుదల చేస్తున్నట్టుగా గత అక్టోబర్‌లోనే ప్రకటన విడుదల చేశారు. అంతే హడావుడిగా ఆర్థికశాఖ మంత్రికి ఎస్సీ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కృతజ్ఞతలు చెప్పుకోవడమేగాక ఆకాశానికెత్తారు. కానీ ఆచరణలో ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా సర్కార్ ఒక్క రూపాయి కూడా పాఠశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయని దుస్థితి నెలకొన్నది. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఇదే స్కీమ్ కింద గిరిజనులకు రూ.93.91 కోట్లను, ఎస్సీలకు రూ.150 కోట్లను ప్రతిపాదించడం గమనార్హం.
యాజమాన్యాల నోటీసులు
సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో తాము ఈ పథకాన్ని కొనసాగించలేమని పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఈ స్కీమ్ నుంచి తప్పుకొనేందుకు 238 ప్రైవేట్ స్కూళ్లు నిర్ణయించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ పరిధిలోని స్కూల్ యాజమాన్యాలు ఆయా జిల్లాల కలెక్టర్లకు, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, జిల్లాల అధికారులకు నోటీసులు అందజేశాయి. పథకం పరిధిలో నుంచి తమను తప్పించాలని 10 రోజుల క్రితమే తేల్చిచెప్పాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, అసలు స్కీమ్‌నే రద్దు చేస్తున్నట్టు తమకు సమాధానం ఇచ్చారని స్కూళ్ల యాజమాన్యాలు వాపోతున్నాయి. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 34వేల మంది విద్యార్థులు రోడ్డున పడటమేగాక, భవిష్యత్తులోనూ కార్పొరేట్ విద్యకు ఆయా వర్గాల బాలలు దూరం కానున్నారు. నిధులు విడుదల చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని, పాఠశాలల నిర్వహణకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను పడుతున్నామని మొత్తుకుంటున్నా ఫలితం దక్కడం లేదని పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు.
ఈ సర్కార్ దళిత, గిరిజనుల వ్యతిరేకి
కాంగ్రెస్ అంటేనే దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం. రేవంత్‌రెడ్డి వచ్చాక ఆయా వర్గాల సంక్షేమం తీవ్ర సంక్షోభంలో పడింది. గురుకులాలు నిర్వీర్యమవుతున్నాయి. నాడు ఉత్సాహంతో ముందుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేడు గురుకులాలంటేనే జంకుతున్నారు. పేద పిల్లలకు సరైన భోజనం కూడా పెట్టని ప్రభుత్వమిది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను విడుదల చేయకుండా ఆయా వర్గాలకు కార్పొరేట్ విద్యకు దూరం చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పాలనలోనే ఇంతటి అవమానకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి. ఈ స్కీమ్‌ను కొనసాగించాలి.
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీజీఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్