హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను కాంగ్రెస్ సర్కారు మరోసారి అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల కన్నా తక్కువగా నిర్ధారించి కించపరిచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. మైనార్టీ గురుకులాల్లోని టీచర్ల జీతాలను ఇటీవల డ్రైవ ర్ కంటే తక్కువగా నిర్ధారించిన ప్రభుత్వం విమర్శలతో వెనక్కి తీసుకుంది. తాజాగా ఎస్సీ సొసైటీలోనూ వేతనాలను ఇలాగే నిర్ధారించింది.
ఎస్సీ గురుకుల సొసైటీలో మొత్తంగా 268 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 5 నుంచి ఇంటర్ వరకు బోధన కొనసాగుతున్నది. రెగ్యులర్ సిబ్బంది కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఇద్దరు, పార్ట్‌టైంగా 2,102 మంది, ఔట్సోర్సింగ్ ద్వారా 1,545 మంది, హనరోరియం పద్ధతిలో 443 మంది మొత్తంగా 4,092 మంది పనిచేస్తున్నారు. అందులో టీచింగ్ సిబ్బంది ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) పోస్టులున్నాయి. నాన్‌టీచింగ్ విభాగంలో డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులున్నారు. వారి సర్వీస్‌ను ప్రతి ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు 11 నెలల కాలానికి రెన్యువల్ చేస్తూ రావడం పరిపాటి. అయితే కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఇప్పటివరకు వారి సర్వీస్‌ను కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు వెలువరించలేదు. దీంతో వారికి వేతనాలు అందని దుస్థితి నెలకొన్నది. నాన్ రెగ్యులర్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వడంతో తాజాగా సర్కారు స్పందించింది. అందులో భాగంగా 4,092 మంది నాన్ రెగ్యులర్ సిబ్బంది సర్వీస్‌ను గత ఏప్రిల్ నుంచి రాబోయే మార్చి 31 వరకు కంటిన్యూ చేస్తూ జీవో 1533ను జారీచేసింది. అంతవరకు బాగానే ఉన్నా టీజీటీ, పీజీటీల వేతనాన్ని రూ.18,200గా నిర్ధారించిన ప్రభుత్వం, ప్లంబర్/ఎలక్ట్రీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాన్ని రూ.19,500గా ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ మైనార్టీ గురుకుల సొసైటీలోనూ నాన్ రెగ్యులర్ సిబ్బంది వేతనాలను ఇదే తరహాలో ఇష్టారీతిన నిర్ణయించడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
వాస్తవంగా గురుకుల సొసైటీలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్నారు. స్టడీ అవర్స్, కిచెన్ డ్యూటీలను పర్యవేక్షిస్తున్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది విధులు మాత్రం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. అయినప్పటికీ వారికన్నా టీజీటీ, పీజీటీల వేతనాన్ని తక్కువ నిర్ధారించడం గమనార్హం. దీనిపైనే నాన్‌రెగ్యులర్ టీజీటీ, పీజీటీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇతర గురుకుల సొసైటీల్లో నాన్‌రెగ్యులర్ టీజీటీ, పీజీటీలకు రూ. 24 వేలు చెల్లిస్తున్నారని వివరిస్తున్నారు. తమకు మిగతా సొసైటీల తరహాలోనే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు గతంలో 12 నెలలకు మినిమం టైమ్సేల్ను ఇస్తామని, జాబ్ సెక్యూరిటీ కల్పిస్తామని, జేఎల్‌కు రూ. 42 వేల జీతం చెల్లిస్తామని హామీ ఇవ్వడమేకాదు, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. కానీ ఇప్పుడు నాన్‌రెగ్యులర్ టీజీటీ, పీజీటీలను మరింతగా అవమానించిందని వారు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే మైనార్టీ, ఎస్సీ గురుకుల సొసైటీలోని రెగ్యులర్ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది వేతనాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. జనరల్, బీసీ, ఎస్టీ గురుకుల సొసైటీ ఉద్యోగుల వేతనాలను ఇప్పటికే చెల్లించారు. కానీ ఎస్సీ, మైనార్టీ సొసైటీల్లో ఉద్యోగుల వేతనాలను ప్రతీ నెలా రెండో వారం లేదంటే మూడో వారంలో చెల్లించడం పరిపాటిగా మారింది. ఇక నాన్ రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు నెలలుగా చెల్లించకపోవడం గమనార్హం.
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీ ఎంపవరింగ్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు జీవో15 ప్రకారం యూజీసీ పే సేల్‌ను అమలు చేయాలని తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీ ఎంపవరింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సాంబలక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఆర్ రమాదేవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత కలిగి, టీజీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపికై సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నామని వివరించారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్‌ను అమలు చేయాలని 2019లో జీవో 15ను ప్రభుత్వం జారీ చేసిందని, అది ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలతో సమాన అర్హతలు కలిగిన తమకు సమాన వేతనం లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి గురుకులాల్లోనూ యూజీసీ సేల్స్ అమలు చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.