Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కారు రైతులను మరోసారి ధోకా చేసింది. రైతుభరోసా పెట్టుబడి సాయం విషయంలో మళ్లీ మాట తప్పింది. జనవరి 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభినప్పుడు మార్చి 31లోపు రైతులందరికీ సాయం అందిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారు. ఇచ్చిన గడువులోపు పెట్టుబడి సాయం అందించలేకపోయిన సర్కారు వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పుడు తాజాగా రైతుభరోసా సొమ్ము ‘తొందరలో’ అందరికీ వేస్తామని కొత్త రాగం అందుకున్నారు.
హుజూర్నగర్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులకు రూ.5 వేల కోట్లు రైతుభరోసా ఇచ్చామని, తొందరలో మిగిలిన రూ.4 వేల కోట్లు అందిస్తామని చెప్పారు. రైతుభరోసాను రూ.12 వేలకు పెంచామని, ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున రైతుభరోసా అందిస్తామని గప్పా లు కొట్టారు. ఈ విధంగా రైతుభరోసాను వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం మార్చి 31వ తేదీ రాత్రిలోపు 90శాతం రైతుభరోసా అందిస్తామని చెప్పారు. ఓవైపు సీఎం తొం దర్లో వేస్తామని మరో వాయిదా వేయగా.. మంత్రి మాత్రం మార్చి 31లోపు 90 శాతం పూర్తిచేస్తామని ప్రకటించడం విడ్డూరం. ఒకరికొకరు పొంతన లేకుండా సీఎం, మంత్రి ఇలా తలొక మాట మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాట్లు వేయకముందే సాయం అందిస్తే రైతులకు ఆదెరువుగా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ ఇలాగే నాట్లు వేయకముందే రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసి పెట్టుబడులకు ఆసరాగా నిలిచింది. కానీ, రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం నాట్లు వేసేటప్పుడు అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని కోతలు మొదలైనా ఇవ్వడం లేదు.