కాగజ్‌నగర్ రూరల్, జనవరి 4: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట 13 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికులను పట్టించుకోరా ? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. శనివారం రాత్రి సమ్మె శిబిరంలో కార్మికులతో కలిసి ప్రవీణ్‌కుమార్ నిద్రించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. 13 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులకు జీతాలివ్వకుండా ప్రభుత్వం గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. వేతనాలు అందక కార్మికులు ఇబ్బంది పడుతుంటే బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ అసెంబ్లీలో ప్రశ్నించాల్సిందిపోయి దర్జాగా నిద్రిస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో పడుకుంటే తాను కార్మికులకు మద్దతుగా సమ్మె శిబిరంలో పడుకొని నిరసన తెలిపినట్లు చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.