Congress Govt | హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సివిల్ పనుల్లో విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. బడా కాంట్రాక్టర్ల బిల్లులు చకచకా పాస్ అవుతుండగా, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి. దాదాపు ఆరువేల మంది చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన రూ.505 కోట్ల బిల్లులు గత ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి.
వివిధ శాఖల్లో సహజంగా చిన్నచిన్న పనులను మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా చేపడతారు. ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి, బిల్లులు కూడా వెంటవెంటనే మంజూరవుతాయి. వీరంతా చిన్న కాంట్రాక్టర్లు కాబట్టి ఒక బిల్లు పాసైతే, ఆ వచ్చిన డబ్బులతో మరో పని చేపడతారు. ఇలా వేలాదిమంది కాంట్రాక్టర్లు ఆయా శాఖల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ విధానం పూర్తిగా అదుపుతప్పింది.
బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో వారు పనులు చేపట్టలేకపోతున్నారు. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలలోపు బిల్లులు కూడా నెలల తరబడి మంజూరు కావడంలేదు. ఇలా ఆరు ప్రధాన శాఖల్లో రూ.10 లక్షలలోపు బిల్లులు అన్నీ కలిపి సుమారు రూ.505 కోట్ల వరకు గత ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఆరువేల మంది కాంట్రాక్టర్లకు సంబంధించిన ఈ బిల్లుల కోసం నిత్యం ఆయా శాఖల అధిపతులు, ఆర్థిఖ శాఖ ఉన్నతాధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, కాబట్టి బిల్లుల కోసం ఒత్తిడి చేయవద్దని అధికారులు సూచిస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నెల, రెండు నెలలంటే ఓపిక పడతాం కానీ, ఇంతకాలం ఎలా ఓపిక పట్టాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్క బడా కాంట్రాక్టర్కు చెందిన బిల్లును ఆపితే ఆరు వేల మంది చిన్న కాంట్రాక్టర్ల బిల్లులన్నీ క్లియర్ అవుతాయని, ప్రభుత్వం తక్షణమే ఈ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
సీఎం, ఆర్థిక మంత్రిని కలిసినా ఫలితం లేదు
పెండింగ్ బిల్లుల విడుదల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తిచేసినా ఫలితం లేకుండా పోయిందని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాపోయారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ రూ.10 లక్షల లోపువేనని, బిల్లులు పెండింగ్లో ఉండటంవల్ల ఆరు వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తమకు ఒక బిల్లు క్లియర్ అయితేనే మరో పని చేపట్టే స్థోమత ఉంటుందని, అయినా ఏ నాయకుడూ, ఏ అధికారీ తమ బాధలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు వెంటనే మంజూరు చేయకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని ఆదుకోవాలని కోరుతున్నారు.