BC Welfare | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమ శాఖ సంక్షోభంలో చిక్కుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలను గుప్పించి ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసింది. హామీల సంగతేమో కానీ బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టి అమల్లో ఉన్న పథకాలకూ గడ్డుకాలం దాపురించింది. కాంగ్రెస్ సర్కార్ పైసా విదిల్చకపోవడంతో రుణాల మంజూరు, ఉపాధి, నైపుణ్య శిక్షణలకు నిధుల్లేక కార్పొరేషన్లు కునారిల్లిపోతున్నాయి. ఉన్న పథకాలకు నిధులు లేకపోగా, కొత్త పథకాల జాడ లేదు. మొత్తంగా బీసీ సంక్షేమం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. సర్కార్ తీరుపై బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కార్ బీసీల కోసం ప్రతిష్ఠాత్మకంగా అనేక పథకాలను అమలు చేసింది. అధికారంలోకి వస్తే ఆయా పథకాలను కొనసాగించడమే కాదు, అంతకు రెట్టింపుగా సాయం చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీలను గుప్పించారు. కానీ ఆచరణలో పలు పథకాల అమలును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. బీసీబంధు పథకాన్ని సర్కార్ నిలిపేసింది. బీసీ యువతకు వివిధ రంగాల్లో వృత్తినైపుణ్య, ఉపాధి శిక్షణ పథకాలను ఆయా శాఖల పరిధిలో అమలు చేయగా, ప్రస్తుతం అవేవీ లేకుండా పోయాయి. ఎంబీసీ వర్గాలకు ఈ-ఆటో రిక్షాలను పంపిణీ చేయగా, వాటినీ రేవంత్‌రెడ్డి సర్కార్ పక్కన నెట్టింది. ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తు పథకానికి కొత్త కనెక్షన్ల మంజూరు నిలిపేసింది.
నిధుల విడుదల నిల్
బీఆర్ఎస్ అమలు చేస్తున్న పలు పథకాలను కొనసాగిస్తున్నా అందుకు సంబంధించిన నిధులను కూడా సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. కల్యాణలక్ష్మి పథకం కింద చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొన్నది. ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు, మరణించిన వారి కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాకు, రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత్ విద్యుత్తుకు నిధులను నెలల తరబడిగా విడుదల చేయడమే లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.3 వేల కోట్లు పేరుకుపోయాయి. ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప గడచిన 24 నెలలుగా ఒక్క రూపాయిని విదిల్చలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసుకున్నా విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడమే లేదు. దీంతో విద్యార్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు బీసీ ఓవర్సీస్ బకాయిలను సకాలంలో చెల్లించడం లేదు. 2025 స్పింగ్, ఫాల్ సీజన్ల ఎంపిక ప్రక్రియనూ పూర్తి చేయలేదు. దీంతో పథకానికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తగ్గిపోతున్నదని అధికారులే వెల్లడిస్తున్నారు. బీసీ స్టడీ సెంటర్లకు నిధులను ఇవ్వడమే లేదు. దీంతో ఆయా సర్కిళ్లలో పోటీ పరీక్షలకు శిక్షణ సైతం నత్తనడకన కొనసాగుతున్నది. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు మెస్ బిల్లుల చెల్లింపు, అద్దెల చెల్లింపు పూర్తిగా గాడి తప్పిపోయింది.
కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటిగా మారింది. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, స్వయం ఉపాధికి రుణాలను అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు సంగతి అటుంచితే.. ఉన్న కార్పొరేషన్లనే నిర్వీర్యం చేస్తున్నది. రాజీవ్ యువవికాసం స్కీమ్‌తో కార్పొరేషన్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి దాపురించింది. అన్ని బీసీకులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి యువతకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా, వడ్డీలేని రుణాలను అందిస్తామని వాగ్దానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లను ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీచేసింది. గడచిన 24 నెలల కాలంలో కార్పొరేషన్లకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయిని విడుదల చేయలేదు. ఇవిగాక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటుచేసిన 8 బీసీ కులాలు రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మీక బోయ, కృష్ణ బలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదు.
రాజీవ్ యువవికాసం పథకం పేరిట ఆయా సామాజిక వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ మరో నమ్మకద్రోహాన్ని తలపెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్సిడీ రుణాలను అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ రుణమొత్తాన్ని భారీగా కుదించింది. మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు తీవ్ర ద్రోహాన్ని తలపెట్టింది. బీసీ కార్పొరేషన్ గరిష్ఠంగా రూ.5 లక్షలు, అంతకు మించి కూడా సబ్సిడీ రుణం అందించే వెసులుబాటు ఉండేది. ఆ రుణాలను యువతకు, ఆయా సామాజికవర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సైతం ఆర్థికంగా ఎంతో చేయూతగా నిలిచేది. కానీ కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం రాజీవ్ యువవికాసం పేరిట సబ్సిడీ రుణాన్ని పూర్తిగా కుదించింది. ఇక రాజీవ్ యువవికాసం పథకం కింద దరఖాస్తులను స్వీకరించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది.
కామారెడ్డి డిక్లరేషన్కూ పాతర
కామారెడ్డి డిక్లరేషన్ల పేరిట ప్రభుత్వం బీసీ వర్గాలకు అనేక హామీలను గుప్పించింది. కనీసం ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ సర్కార్ అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో గౌడ్లకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది ఇప్పటికీ అమలుకు నోచలేదు. బీసీ సబ్‌ప్లాన్ కింద బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్ల కేటాయింపు, ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులవృత్తిదారులకు 50 ఏండ్లకే పింఛన్ల మంజూరు, కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థికసాయం, ముదిరాజ్‌లను బీసీ(డీ) గ్రూప్ నుంచి బీసీ(ఏ)లో చేర్చ డం, కులవృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ ఇలా అనేక హామీలను గుప్పించింది. అందులో డిక్లరేషన్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ అమలు చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యం గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని సైతం అటకెక్కించింది. కులగణన నిర్వహించి, 42శాతం కోటాకు బిల్లులను చేసి, తుదకు మళ్లీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీ కోటాను గతం కంటే తగ్గించడం కాంగ్రెస్ సర్కార్ హామీల అమలు తీరుకు అద్దం పడుతున్నది.
ప్రధాన పెండింగ్ నిధులు

