Telangana | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. 13 ఏండ్లు, 16 ఏండ్లు, 18 ఏండ్ల కాలపరిమితితో రాష్ట్ర ఆర్థికశాఖ ఈ బాండ్లను జారీచేసింది. వీటిని ఈ నెల 23న వేలం వేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది. దీంతో ఈ నెలలో రేవంత్రెడ్డి సర్కారు చేసిన అప్పు రూ.7 వేల కోట్లకు, గత 8 నెలల్లో తెచ్చిన అప్పు రూ.35 వేల కోట్లకు చేరనున్నది.
ఈ నెలలో టీజీఐఐసీ ద్వారా రూ.2 వేల కోట్లు, 16న మరో రూ.2 వేల కోట్ల రుణం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రతి నెలా ఆర్బీఐ నుంచి రూ.5 నుంచి 6 వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నది. జూలై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయించడం ద్వారా రూ.15 వేల కోట్ల నుం చి రూ.18 వేల కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ, కాంగ్రె స్ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినా రాష్ట్రంలో కనీసం ఒక్క భారీ ప్రాజెక్టునుగానీ, ప్రజల జీవితాలను మార్చే కొత్త పథకాన్నిగానీ అమలు చేయకపోవడం గమనార్హం.