KTR | తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు ధర్నాకు దిగిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు పాలనకు నిదర్శనం అన్నారు. వేలకోట్ల రూపాయల ముడుపుల కోసం బడా కాంట్రాక్టర్లకు, క్యాబినెట్‌లోని మంత్రుల కంపెనీలకు బిల్లులు చెల్లిస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేవలం ముడుపులు ఇవ్వడం లేదన్న ఏకైక కారణంతో చిన్న కాంట్రాక్టర్లను ముప్పు తిప్పలు పెడుతుందని కేటీఆర్ విమర్శించారు. గతంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల నిరసనలు, నేడు సీఎం కార్యాలయం ఎదుటే ధర్నా.. రేవంత్ రెడ్డి పాలన ఎంత దిగజారిందో తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు.
20 శాతం కమిషన్లు ఇవ్వలేని చిన్న కాంట్రాక్టర్లు చివరకు ప్రభుత్వ సచివాలయంలో ధర్నాకు దిగడం, రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు ఆర్థిక పాలనకు నిదర్శనం అన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి వంటి ప్రజా సంక్షేమ పథకాలపై పని చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల కోసం కాంట్రాక్టు చేసిన చిన్న కాంట్రాక్టులను పక్కనపెట్టి బడా కాంట్రాక్టర్ల బిల్లులు మెరుపువేగంతో చెల్లించబడుతున్న తీరును కేటీఆర్ ఎండ గట్టారు.
ఢిల్లీకి వేలకోట్ల రూపాయల బ్యాగులు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందని.. కానీ చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుకు నిధులు లేవనడంపైన కేటీఆర్ మండిపడ్డారు. 20 నెలల పాలనలోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, 420 ఎన్నికల హామీలలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఏం చేశారు అన్న అంశంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పరిపాలనకు కేంద్రంగా నిలవాల్సిన సచివాలయం, నేడు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. చిన్నకాంట్రాక్టర్లు పలుమార్లు ఆరోపించిన 20 శాతం కమిషన్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఆర్.ఆర్.టాక్స్ ఉందని పదేపదే చెప్పడం మాత్రమే కాకుండా ఈ అంశంపైన విచారణ జరిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేంద్రం సచివాలయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు 20శాతం కమిషన్ల ఆరోపణలు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ సర్కారు పూర్తిగా కమిషన్ కార్పొరేషన్‌గా మారిందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. వెంటనే చిన్న కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోతే బాధిత కాంట్రాక్టర్లతో కలిసి బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.