ఆవును.. రుణమాఫీ ఎగ్గొట్టడంతో మోసపోయిన, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న, కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులు నిత్యం మిమ్మల్నే తలుచుకుంటున్నారు. మహాలక్ష్మి కింద ప్రతినెలా రావాల్సిన రూ. 2,500 కోసం మహిళలు, కల్యాణలక్ష్మి కింద రావాల్సిన తులం బంగారం కోసం ఆడబిడ్డల తల్లిదండ్రులు, మీరిస్తామన్న స్కూటీల కోసం యువతులు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డుల కోసం విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, రూ.నాలుగు వేల పింఛన్ కోసం అవ్వాతాతలు, పీఆర్సీ, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిత్యం మిమ్మల్నే తలుచుకుంటున్నారు.
– హరీశ్‌రావు
హైదరాబాద్ మే 19 (నమస్తే తెలంగాణ): ‘అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైంది.. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ దిక్కులేకుండా పోయింది.. గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషన్ పత్తాలేకుండా పోయింది.. గప్పాలు కొట్టుకున్న మహిళా డిక్లరేషన్ మంటగలిసింది.. ఇక ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు మోసానికి తెరలేపింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప, అమలులో మాత్రం డెడికేషన్ లేదని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. పైన పటారం.. లోన లోటారం అన్న చందంగా కాంగ్రెస్ పాలన ఉన్నదని ఎద్దేవా చేశారు. నల్లమల అడవిబిడ్డనని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తనను కలిసేందుకు వచ్చిన చెంచులను అరెస్టు చేయించి ఫాసిస్టు తత్వాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనింద, తెచ్చిపెట్టుకున్న ఆవేశం తప్ప కంటెంట్ లేదు.. కాంటెస్ట్ లేదని ఎద్దేవా చేశారు. తమ పాలనా ప్రయోజనాలను ప్రజలు పదే పదే గుర్తుచేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి డప్పు కొట్టుకోవడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.. అమావాస్య నాడు పున్నమి వెన్నెల గురించి చెప్పగలిగిన నేర్పరితనం రేవంత్‌కే చెల్లిందని విమర్శించారు. ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని తుపాకీ రాముడి డైలాగులతో సినిమాల్లోని కామెడి స్టార్లనే మించిపోయారని దుయ్యబట్టారు.
దేశాలు తిరిగి పెద్దమొత్తంలో పెట్టుబడులు తెచ్చామని సీఎం చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పెట్టుబడుల వ్యవహారం.. సచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలిచ్చినట్టుగా ఉన్నదని దెప్పిపొడిచారు. గుడ్డిలో మెల్ల చందంగా ఇంతకాలం దివాలా పాట పాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాటమార్చి తెలంగాణ దేశానికి నంబర్ వన్ అని చెప్తున్నారని పేర్కొన్నారు. పదే పదే రంగులు మార్చుతున్న రేవంత్‌రెడ్డిని చూసి నల్లమల అటవీ ప్రాంతంలోని ఊసరవెల్లులే నివ్వెరపోతున్నాయని చురకలంటించారు. ఇప్పటికైనా తప్పుడు, చెప్పుడు మాటలు మాని ప్రజలకు మేలు చేసే పథకాలపై ఆలోచనలు చేయాలని హితవుపలికారు.
సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు యత్నించిన చెంచు సోదరులను అరెస్టు చేయడం హేయమని హరీశ్‌రావు విమర్శించారు. ‘ప్రశ్నించిన వారిని నిర్బంధించడమే ప్రజాస్వామ్యమా? ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన? నల్లమల అడవుల నుంచి వచ్చానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి.. అడవిబిడ్డల సంక్షేమంపై చూపించే ప్రేమ ఇదేనా?’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఐటీడీఏ పీవోగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరడం, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పోడు భూములను సాగు చేసుకోనివ్వడంలేదని మీ దృష్టికి తీసుకురావడం, తమ ఆరాధ్య దైవాల ఉత్సవాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ బాగు కోసం ఖర్చు చేయాలని అడగడమే వారు చేసిన నేరమా? అని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసి ఆమ్రాబాద్ ఠాణాలో నిర్బంధించిన చెంచు ప్రతినిధులు పద్మ, గురువయ్యతోపాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.