Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలపై మరింత రుణభా రం మోపుతున్నది. రుణాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నది. నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచి నేటివరకు అంటే.. 300 రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.73,495 కోట్ల అ ప్పు చేసింది. మంగళవారం ఆర్బీఐ నుం చి మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకున్నది. రూ.1,500 కోట్ల విలువైన ఒక బాండ్‌ను 15 ఏండ్ల కాలానికి, రూ.500 కోట్ల విలువైన బాండ్‌ను 18 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు జారీచేసి ఈ రుణం పొందింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.48,618 కోట్ల అ ప్పు సమీకరించుకున్నది.
సెప్టెంబర్ 3న రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు, 17న రూ.500 కోట్లు.. ఇలా నెల వ్యవధిలోనే రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మంగళవారం మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకున్నది. ఇలా ప్రతి నెలా రూ.5 వేల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది. ఆర్బీఐ నుంచి సేకరించే రుణాలు సరిపోక.. వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర నెలల్లోనే రూ.25 వేల కోట్ల మేర గ్యారెంటీలు ఇచ్చింది. అప్పులను ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కోసమో, విప్లవాత్మక పథకం కోసమో ఖర్చు చేస్తాయి. కానీ, ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో అలాంటి దేమి చేయకపోవడంపై ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.