హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు.. (SC ST Atrocities act) ప్రభుత్వం నుంచి పరిహారం అందక కుమిలిపోతున్నారు. వేధింపులు, దాడులకు గురైన పేద ప్రజలు, ఆర్థికంగా నష్టపోయిన అభాగ్యులు రేవంత్రెడ్డి ప్రభుత్వ (Revanth Reddy Govt) నిర్లక్ష్యంతో మరోసారి బాధితులుగా మారుతున్నారు. బాధితులకు ఆర్థికంగా అండగా నిలబడి, పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం.. బాధితులకు నిధులను చెల్లించకుండా ఏడాదిగా తిప్పుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4088 మంది బాధితులు ఉండగా వారికి ఇవ్వాల్సిన రూ.40 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో అట్రాసిటీ చట్టానికి కూడా కాంగ్రెస్ సర్కారు (Congress Govt) తూట్లు పొడుస్తున్నదని ఎస్సీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ తలంటుపోసినా కూడా రేవంత్ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దళితులు, ఆదివాసీ, గిరిజనులపై భౌతిక దాడులు, వివక్ష, దూషణలను నిరోధించేందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దోహదపడాలని కోరుతున్నారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని చట్టంలోని సెక్షన్ 12(4), 4ఏ కింద సంబంధిత జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. కానీ ఏడాది కాలంగా నిధులను చెల్లించడం లేదని వాపోతున్నారు.
అట్రాసిటీ కేసులలో బాధితులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వ పెద్దలు పూటకోమాట చెప్తున్నారు. నిరుడు ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఒక రోజు ముందు రూ.14.38 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ ఆ నిధులు ఇప్పటికీ అందలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేంద్రం విడుదల చేయాల్సిన 50 శాతం నిధులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
బాధితుల పక్షాన నిలువాల్సిన ప్రభుత్వమే వారిని క్షోభకు గురిచేస్తున్నది. పరిహారం చెల్లించకుండా తిప్పుకుంటున్నది. పెండింగ్లో ఉన్న పరిహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలి.
