వరంగల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హనుమకొండ, జనగామ, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగరి జిల్లాల్లోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల పంపు హౌస్‌ను వినియోగంలోకి తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం బయటపడింది. సాగునీటి నిర్వహణలో కీలకమైన సాంకేతిక అనుమతులు లేకుండానే పబ్లిసిటీ కోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్, పొంగులేటి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం హడావుడిగా దేవన్నపేట పంపు హౌస్‌లోని మోటర్లను ఈ నెల 18న ఆన్ చేసేందుకు వచ్చారు.
మోటర్లను బిగించిన ఆస్ట్రియాకు చెందిన అండ్రీజ్ కంపెనీ సాంకేతిక అనుమతి ఇవ్వకపోవడంతో.. అధికారులు మాన్యువల్‌గా ఆన్ చేయబోయి విఫలమ్యారు. ఇదితెలిసిన ఆస్ట్రియా కంపెనీ .. సాంకేతిక నిపుణులు లే కుండా మోటర్లను ఆన్ చేస్తే తదుపరి పరిణామాలకు తాము బాధ్యత తీసుకునేది లేదని స్పష్టం చేసింది. సాగునీటి శాఖ సూచన మేరకు ఆస్ట్రియా కంపెనీకి చెందిన ప్రొటోకాల్ ఇంజినీర్ శనివారం దేవన్నపేట పంపుహౌస్ కు చేరుకున్నారు. పంపులను ప్రతి దశలో పరిశీలించాలని, ఇంకా సమయం పడుతుందని ఈ ఇంజినీర్ చెప్పడంతో పంపులను ఆన్ చేసే ప్రక్రియను మరోసారి వాయిదా వేశారు.