హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా యూరియా లేదంటూ ఇటు సర్కారు, అటు వ్యవసాయ శాఖ బాహాటంగానే ఒప్పుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది. ఎరువులను కేంద్రమే ఇవ్వనప్పుడు తమను ఏం చేయమంటారనే విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉండటం విమర్శలకు తావిస్తున్నది. తద్వారా కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా, ఇతర ఎరువుల కొరతకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
యూరియా సరఫరాలో విఫలమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఒప్పుకొన్నది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కోటాను తీసుకురావడంలో కూడా విఫలమైనట్టు స్వయంగా వ్యవసాయ శాఖ చెప్తున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షలో వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్రం నుంచి రాష్ర్టానికి 5 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 3.07 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్టు తెలిపింది. తద్వారా 1.93 లక్షల టన్నుల కొరత ఏర్పడినట్టు పేర్కొన్నది. దీంతోపాటు జూలైలోనూ 1.6 లక్షల టన్నులు రావాల్సి ఉండగా, 1.16 లక్షల టన్నులు మాత్రమే వచ్చిందని, ఈ నెలలోనూ 44 వేల టన్నులు కోత పెట్టినట్టు వివరించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి రావాల్సిన యూరియాలో 2.37 లక్షల టన్నులు తక్కువగా వచ్చినట్టు ఒప్పుకొన్నది.
రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల కోటాను ఎప్పటికప్పుడు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు ఉంటుంది. కానీ రైతుల కోసం ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లేందుకు వ్యవసాయ మంత్రికి తీరిక దొరకడం లేదా? అనే విమర్శలొస్తున్నాయి. కేంద్రం నుంచి ఎరువులు రాకపోతే.. ఇక్కడ సమీక్షలు పెట్టి ఏం లాభమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖలు రాయడంపైనా జోకులు పేలుతున్నాయి. నేరుగా వెళ్లి అడగాల్సిన పరిస్థితుల్లో లేఖలు రాస్తే ప్రయోజనమేమిటనే విమర్శలున్నాయి. ఇప్పటికే మంత్రి తుమ్మల యూరియా కోసం కేంద్ర మంత్రి నడ్డాకు ఐదుసార్లు లేఖలు రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా శనివారం మరోసారి లేఖ రాశారు. లేఖలు రాయడానికి బదులు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వ వ్యవహారశైలిని గమనిస్తే ఈ వైఫల్యాన్ని కేంద్రం ఖాతాలో వేసి, తాను తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి యూరియా కోటా రావడం లేదంటూ మంత్రి తుమ్మల, వ్యవసాయ శాఖ పదే పదే చెప్పడం ఇందులో భాగమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి కోటా రావడం లేదని చెప్తున్న వ్యవసాయ శాఖ.. ఈ కోటాను తెప్పించేందుకు ఏం చేసిందనే అంశాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సైతం కేంద్రం నుంచి యూరియా కోటా రాబట్టడంలో విఫలమయ్యారనే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జరుగుతున్నది. కేంద్రంతో సరైన విధానంలో కమ్యూనికేషన్ నడపడం లేదనే విమర్శలున్నాయి. యూరియా కోసం ఢిల్లీకి ఉన్నతాధికారులు వెళ్లకుండా కిందిస్థాయి ఉద్యోగులను పంపించడం కొంపముంచిందనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో 2.37 లక్షల టన్నుల యూరియా కొరత ఉన్నది. ఆగస్టులో మరో 3 లక్షల టన్నుల యూరియా అవసరం. అంటే, ఆగస్టులో మొత్తంగా రైతులకు సుమారు 5.37 లక్షల టన్నుల యూరియా అందించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం నుంచి ఏ మేరకు వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి రోజంతా యూరియా కోసం షాపుల వద్ద పడిగాపలు కాస్తున్నారు. చెప్పులు, ఆధార్‌కార్డులు క్యూలైన్లలో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో యూరియా సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉన్నదనే అందోళన వ్యక్తమవుతున్నది.