కల్వకుర్తి, మే 29 : కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం కూడా చేతకాన్ని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తుందా? అని ప్రశ్నించారు. యూరియా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్‌కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, క్వింటా వడ్లకు 12 నుంచి 20 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం జైపాల్‌యాదవ్ కల్వకుర్తి పట్టణంలోని పలు మిల్లుల వద్ద వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలు విని చలించిపోయారు.
మక్కలను విక్రయించడంతో తమ బతుకులు బిచ్చగాళ్ల కన్నా హీనంగా మారాయని, ఇప్పుడు వరిధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వరి ధాన్యం నాసికరంగా ఉన్నదని, తరుగు పేరిట క్వింటాకు 12 నుంచి 20 కిలోల వరకు కట్ చేస్తున్నారని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా విక్రయిస్తే పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని, ఏం చేయాలో అర్థం కావడం లేదని, వడ్ల ధాన్యం విక్రయాలు దోపిడీ వ్యవస్థను తలపిస్తున్నదని వాపోయారు. రైతుల బాధలు విని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కలత చెందారు. ప్రభుత్వం, మిల్లర్ల తీరును ఎండగట్టారు. ఇంత పెద్ద ఎత్తున తరుగు తీస్తుంటే.. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉన్నదనే అనుమానాన్ని జైపాల్‌యాదవ్ వ్యక్తం చేశారు. తరుగు దోపిడీపై ఎమ్మెల్యే, మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తరుగు లేకుండా, రైతుల కల్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేశామని తెలిపారు.