హైదరాబాద్: పండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలకు కన్నీటి వ్యథ మిగిలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. రైతన్నల ఆరుగాలం కష్టం అకాల వర్షాలతో దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
రైతన్నల ఆరుగాలం కష్టం
అకాల వర్షాలతో దెబ్బతిన్నదిపండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలకు కన్నీటి వ్యథ మిగిలింది
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి
ఎద్దు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 22, 2025
తడిసిన ధాన్యం.. అన్నదాత ఆగం
సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం లబోదిబోమంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతన్న కన్నీటి వేదనే కనిపిస్తున్నది.
వరదలో ధాన్యం..
గడిచిన 20 రోజులుగా అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను సివిల్‌సైప్లె అధికారులు పట్టించుకోకపోగా, ధాన్యాన్ని కాపాడేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయి నష్టం వస్తుందని తెలిసినా నింపాదిగా ధాన్యం కొనుగోళ్లు చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ధాన్యం వరదలో కొట్టుకుపోతుంటే.. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
130 లక్షల టన్నుల ఉత్పత్తి.. కొన్నది 56 లక్షలే
ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యానికి ధాన్యం కొనుగోళ్ల లెక్కలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. లక్ష్యం కొండంత ఉండగా కొన్నది మాత్రం కొసరంత ఉన్నది. ఈ యాసంగిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 130 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకు కేవలం 55.97 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మొత్తం ధాన్యంలో ఇది సగం మాత్రమే. మార్చి 20వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించినట్టు చెప్పిన సివిల్ సైప్లె అధికారులు రెండు నెలలు గడుస్తున్నా సగం కూడా కొనలేదు.
నెల రోజులైనా కేంద్రాల్లోనే ధాన్యం..
అకాల వర్షాల అంచనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయండంటూ రైతులు కోరినా అధికారులు కాంట పెట్టలేదు. నెలల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే మూలిగిన ధాన్యం చివరికి వర్షార్పణం అవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీలు, వేయింగ్ మిషన్లు, తేమ చూసేందుకు మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో లేకపోవడం కూడా కొనుగోళ్ల ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. మరోవైపు కొర్రీలు పెడుతూ ధాన్యం కొనకపోవడంతో రైతాంగం కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తున్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2.87 లక్షల మంది రైతుల నుంచి 18.47 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించింది. ఇందుకు గానూ రైతులకు బోనస్ కింద రూ. 923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రైతులకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం.