కూలేశ్వరం అన్నారు.. లక్ష కోట్లు వృథా అన్నారు.. ఇక దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాకా ఊదారు. కమిషన్ల పేరుతో నానాయాగీ చేశారు. చివరికి రెండేండ్ల తర్వాత మళ్లీ అదే దిక్కయింది. తమ్మిడిహట్టి అంటూ గొప్పలకు పోయిన సర్కారు ఇప్పుడు కాళేశ్వరమే తమను కాపాడగలదని భావిస్తున్నది. స్థానిక ఎన్నికల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తడానికి ముందే సర్దుకున్నది. కూలిపోయిందన్న కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామని ఇప్పుడు తీరిగ్గా ప్రకటించింది.
హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. ఈ విషయాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ అంగీకరించింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్‌లపై అడ్డగోలుగా అసత్య ఆరోపణలకు దిగిన ప్రభుత్వం తాజాగా బరాజ్‌ల పునరుద్ధరణకు పూనుకున్నది. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, నిర్దేశిత లక్ష్యాల మేరకు నీటి మళ్లింపు అసాధ్యమని ఇంజినీరింగ్ అధికారులు కరాఖండిగా తేల్చిచెప్పడంతోపాటు, గత రెండేండ్లుగా రబీ సీజన్లో పూర్తిస్థాయిలో నీటిని అందివ్వకపోవడంతో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి స్థితిలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు మేడిగడ్డ మరమ్మతులపై దృష్టి సారించించింది. బరాజ్‌ల పునరుద్ధరణకు నడుం బిగించింది. డిజైన్ కన్సల్టెన్సీల నుంచి ఈవోసీ (ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రస్ట్) కోసం నోటిఫికేషన్ జారీచేసింది.
మేడిగడ్డే శరణ్యం
తెలంగాణకు గోదావరిలో 968టీఎంసీల వాటా ఉన్నది. అందులో రాష్ట్ర ఏర్పాటు నాటికి నికరంగా 200 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి. మరోవైపు అప్పటికే నిర్మించిన ఎస్సారెస్సీ, కడెం తదితర ప్రాజెక్టులు పూడికతో పేరుకుపోయాయి. తద్వారా గోదావరిలో 50టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని తెలంగాణ కోల్పోయిన దుస్థితి. ఈ నేపథ్యంలో గోదావరిలో రాష్ట్ర వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఏకైక పరిష్కార మార్గం ప్రాణహిత జలాలు మాత్రమే. అయితే తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, మరోవైపు ఎగువన మహారాష్ట్ర వినియోగం తరువాత ప్రతిపాదిత 160 టీఎంసీల జలాలు అందుబాటులో లేని దుస్థితి నెలకొన్నది. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీనే వెల్లడించింది. చివరికి మహారాష్ట్ర కేవలం 148ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ను నిర్మించేందుకు అంగీకరించింది.
ఇక ఆ స్థాయిలో బరాజ్‌ను నిర్మిస్తే తమ్మిడిహట్టి నుంచి గరిష్ఠంగా 44టీఎంసీలను మాత్రమే మళ్లించుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ మేధోమథనం సాగించారు. ప్రాణిహిత చేవేళ్ల ప్రాజెక్టుపై ఇంజినీర్లతో సుదీర్ఘంగా చర్చించారు. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అనుగుణంగా ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. ప్రాణహిత చేవేళ్లను రెండు ప్రాజెక్టులుగా విభజించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును కేవలం ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేశారు. తమ్మిడిహట్టి నుంచి బరాజ్ లోకేషన్ మేడిగడ్డకు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేశారు. గోదావరిలో తెలంగాణ తన నీటివాటాను పూర్తిగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలను రూపొందించారు.
రైతుల నుంచి వ్యతిరేకత
తెలంగాణలో సాగునీటి రంగం గురించి చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, ఆ తరువాత అనే చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో పంటల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎస్సారెస్సీ మొదటి ఆయకట్టుకు పూర్తి భరోసా దక్కడమే కాదు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఫేజ్-2 ఆయకట్టుకు సైతం సాగునీరు అందడం ప్రారంభమైంది. బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన ఇతర అభివృద్ధి, ప్రణాళికలను ఫలితంగా సాగువిస్తీర్ణం పెరిగింది. కాంగ్రెస్ మాత్రం దీనిని అంగీకరించేందుకు ససేమిరా అంది.
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ను నిలిపేసిన నాటి నుంచి ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు పునరావృతమవుతూ వస్తున్నాయి. ఎస్సారెస్పీ స్టేజీ-2ను పక్కనపెడితే ఫేజ్-1లోని జగిత్యాల, మంథని తదితర నియోజకవర్గాల్లోనే రబీ సీజన్‌కు సక్రమంగా సాగునీరు అందని దుస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా, నిరర్థకమంటూ రాజకీయాలు చేయడాన్ని రైతాంగం తప్పుబట్టింది. రైతుల ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు చేటు చేస్తుందని భావించిన ప్రభుత్వం నష్టనివారణ చర్యలను చేపడుతున్నట్టు తెలిసింది. అందులో భాగంగా బరాజ్‌ల పునరుద్ధరణకు నడుం బిగించినట్టు సమాచారం.
15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను సమకూర్చేందుకు అనుభవమున్న ఏజెన్సీల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ప్రారంభించింది. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 20 పిల్లర్ కుంగుబాటునకు గురైన విషయం తెలిసిందే. దానిపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పటిష్టతకు చేపట్టాల్సిన తదుపరి చర్యలను ఇరిగేషన్‌శాఖకు పలు సిఫారసులు చేసింది. కేంద్ర, జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించి, వాటి సహకారంతో పునరుద్ధరణ పనులను నిర్వహించాలని వెల్లడించింది. అయితే కాంగ్రెస్ సర్కారు ఇంతకాలం దీనిపై తాత్సారం చేస్తూ వచ్చింది.
తాజాగా రైతాంగం నుంచి వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ నేపథ్యంలో ఎట్టకేలకు బరాజ్‌ల పునరుద్ధరణకు పూనుకున్నది. బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లను రూపొందించడంలో తమకు తగినంత అనుభవం లేదని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చేతులేత్తేసింది. ఈ నేపథ్యంలో బరాజ్‌ల నిర్మాణంలో, పునరుద్ధరణ పనుల్లో అనుభవమున్న ఏజెన్సీలను కన్సల్టెన్సీగా ఏర్పాటు చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్లను సమకూర్చేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 15వ తేదీ నాటికి ఏజెన్సీలు (ఈవోఐ)ని వెల్లడించాలని, వివరాలకు ఇరిగేషన్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని తెలిపింది.ప్రాజెక్టును బలిచ్చేందుకు విఫలయత్నం
మేడిగడ్డలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యను సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టును బలిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రాజెక్టు నిరర్ధకం అన్నస్థాయిలో ప్రచారం చేసింది. దాదాపు రెండేండ్లుగా బరాజ్‌కు మరమ్మతులు చేపట్టకుండా రాజకీయాలకు పాల్పడింది. తొలుత ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఆ తరువాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరిట కాలయాపన చేసింది. అవినీతి మరకలను అంటించేందుకు, బీఆర్ఎస్ను, మాజీ సీఎంను బద్నాం చేసేందుకు ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఆశించిన స్థాయిలో ఆయా కమిషన్ల నివేదికలు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సరైనదేనని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు డైలమాలో పడింది. దీనికితోడు తమ్మిడిహట్టి నుంచి నిర్దేశించిన మేరకు జలాలను తరలించలేమని ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఇంజినీర్లే ప్రభుత్వానికి స్పష్టంగా తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను నిర్మించినా తెలంగాణకు సంబంధించిన పూర్తిస్థాయి నీటివాటాను వినియోగించుకోవాలంటే మేడిగడ్డ పునరుద్ధరణ అనివార్యమని తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు బరాజ్ పునరుద్ధరణపై దృష్టి సారించినట్టు తెలిసింది.