Gruha Lakshmi | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుల లిస్టుతోపాటు కండిషన్ల లిస్టు కూడా భారీగానే ఉన్నది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కండిషన్లు పెట్టినట్టు సమాచారం. కరెంటు వినియోగం ఏ మేరకు ఉన్నది? ఏసీతోపాటు ఖరీదైన విద్యుత్తు ఉపకరణాలు ఏమైనా వాడుతున్నారా? నెలనెలా కరెంటు బిల్లు ఎంత వస్తున్నది? ఉంటున్న ఇంటి అద్దె ఎంత? వంటి అంశాలపై కూడా దృష్టిపెట్టారు. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొనేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బం ది క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తున్నారు.
‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి 82,82,332 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇండ్లను నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించింది. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్లు కేటాయించింది. అయితే, కేటాయించిన బడ్జెట్‌కు, ఇండ్ల లక్ష్యానికి పొంతన కుదరడంలేదు. ఒక్కో ఇంటికి రూ. ఐదు లక్షల చొప్పున 4.16 లక్షల ఇండ్లకు 20,825 కోట్లు ఖర్చవుతుంది. కేటాయించింది మాత్రం 7,740 కోట్లే. అంటే 13 వేల కో ట్లకుపైగా వ్యత్యాసం ఉన్నది. దీంతో కేంద్ర నిధులపై ఆధారపడటమే కాకుండా లబ్ధిదారులను తగ్గించాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకే దరఖాస్తులను 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో సగం మందికి.. కనీసం 40 లక్షల మందికి ఆర్థికసాయం చేయాలన్నా.. ప్రస్తుత కేటాయింపుల ప్రకారం పదేండ్లు పడుతుంది.
దరఖాస్తులను తగ్గించడమే లక్ష్యంగా పరిశీలన జరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే లెక్కకు మిక్కిలి కండీషన్లు పెట్టినట్టు పరిశీలకులు చెప్తున్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నదా? అది లేకుంటే ఆదా య ధృవీకరణ, కుటుంబఆదాయం, ఆస్తులు, భూ ములు, పట్టణ ప్రాంతాలో ఇంటి జాగాలు ఉన్నా యా? కారు, ద్విచక్ర వాహనం, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఉన్నాయా? ఇంట్లో ఎంతమంది పనిచేసే వారున్నారు? వారి నెల సంపాదన ఎంత? గతంలో ప్రభుత్వ లబ్ధిపొందారా? గతంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు అయిందా? తదితర అంశాలను క్షేత్రస్థాయి లో తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పరిశీలన చూ స్తుంటే రోజువారీ కూలీలు కూడా ఈ పథకానికి అర్హత పొందడం కష్టమేనని అంటున్నారు. కడు పేదలు మా త్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావి స్తే.. వారికి సర్కారు ఇచ్చే రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించుకునేందుకు సొంత జాగా అయినా ఉండాలి కదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరు ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశంకంటే దరఖాస్తును ఎలా తిరస్కరించాలనే తాపత్రయమే ఎక్కువగా ఉన్నట్టు కనపడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా రాష్ర్టాల్లో పేదల గృహనిర్మాణానికి విరివిగా సహకారం అందిస్తున్నది. ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నది. కేంద్ర సహాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.3.5 లక్షలు జతచేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి సహాయం పొందాలంటే వారు నిర్ధారించిన మార్గదర్శకాలకు లోబడి ఇండ్లను నిర్మించాల్సి ఉంటుంది. కనిష్టంగా 30 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాలో నిర్మించాలి. అంటే, కార్పెట్ ఏరియా కనిష్టంగా 323 చదరపు అడుగుల వరకు ఉండాలి. ఇందులో ఒక వంటగది, మరగుదొడ్డి, ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఉండేలా చూడాలి. అయితే రాష్ర్టాలు 323 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో స్థానిక అవసరాలకు తగ్గట్టు డిజైన్లలో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నది. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కూడా అధికారులు ఆయా ప్లాట్ ఏరియాలకు తగ్గట్టుగా కనీసం 323 చదరపు అడుగులకు తగ్గకుండా గృహాలు నిర్మించేలా పలురకాల డిజైన్లను రూపొందించారు. లబ్ధిదారులు తమ ఇష్టానుసారం డిజైన్లలో మార్పులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని, కార్పెట్ ఏరియా మాత్రం కనీసం 323 చదరపు అడుగులు ఉండేలా చూడాలని నిర్ణయించారు. నిర్ధారిత లక్ష్యం ప్రకారం నాలుగు లక్షల 16 వేల ఇండ్ల నిర్మాణానికిగాను ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏమాత్రం సరిపోయే అవకాశం లేదు.