చిక్కడపల్లి/సికింద్రాబాద్, మార్చి 26 : నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇండ్లలోకి చొరబడి విద్యార్థులు, నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులతో వేధించడంపై నిరుద్యోగ జేఏసీ మండిపడింది. అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతంలో జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ముట్టడికి యత్నించిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. చిక్కడపల్లిలో జేఏసీనేతలు కొడంగల్ రవి, శంకర్ నాయక్, రవి కుమార్, రవి రాథోడ్, నరేశ్, తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మూర్తి, క్రాంతి, హారున్రాజు, ఆంజనేయులు, వేణు తదితరులను అరెస్టు చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను వాడుకొని నేడు విస్మరించిందని మండిపడ్డారు. హామీలను అమలు చేయకపోగా తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇందుకోసమేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించామని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఆశ చూపి ఈ ప్రభుత్వం తమను తీవ్రంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో రాష్ట్రంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారని పేర్కొన్నారు.
ప్రజాపాలన అంటే మందుస్తు అరెస్టులు, నిర్బంధాలేనా? అని నిరుద్యోగ జేఏసీ నేత కయ్య వెంకటేశ్ ప్రశ్నించారు. జేఏసీ నేత కయ్య వెంకటేశ్, కిరణ్ రాథోడ్‌ను పోలీసులు ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్నిరోజులు పోలీసులను పెట్టి ఈ ఉద్యమాన్ని అణచివేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్ఐ కమిటీ ప్రతినిధులు ఓయూ మెయిన్‌గేట్ లైబ్రరీ నుంచి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో నిరుద్యోగుల అంశాన్ని చర్చించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.