హనుమకొండ, మే 3 : ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపనున్నతున్నదని, అందులో భాగంగానే జీవో 7 తీసుకొచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి మాట్లాడారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదని మండిపడ్డారు.
ఈ నెల 6న వరంగల్ వేదికగా జరుగుతున్న రైతు సంగ్రామ సదస్సు తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లాంటి మిగతా డిక్లరేషన్లపై పోరాడుతామని చెప్పారు. రూ. 13వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయని, ప్రభుత్వం విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోమని చెప్తూ దాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఫీజుల వసూలు కోసం తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.