హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దశలవారీగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే జీవో-9 తీసుకొచ్చిందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పాతపద్ధతిలోనే స్కీమ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నేతలు గురువారం సచివాలయ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు.. బీసీ నేతలు, విద్యార్థులను ఎకడికకడే అడ్డుకొని అరెస్టు చేసి గోషామహాల్, అబిడ్స్ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా అరెస్టయిన బీసీ సంఘాల నేతలు కులచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, కనకాల శ్యాం, జాజుల లింగం, మణిమంజరి, జాజుల లింగంగౌడ్, బొల్లెపల్లి స్వామిగౌడ్, పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లికార్జునయాదవ్, మాదేశి రాజేందర్, తారకేశ్వరి, ఇంద్రం రజక, వరుణ్‌కుమార్, మహేశ్ మేరు, సంపత్ నాయుడు, మధుయాదవ్, గజ్జెల సత్యరాజ్గౌడ్, అనంతుల సాయి తదితరులు స్థానిక మీడియాతో మాట్లాడారు. పాత పద్ధతిలోనే స్కీమ్‌ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదల కోసం రెండున్నరేండ్లుగా శాంతియుతంగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఈ నేపథ్యంలోనే సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. రెండ్రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
సచివాలయం ముట్టడిలో అరెస్టయిన బీసీ సంఘాల నేతలను బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణలతో కలిసి ఆయా పోలీస్స్టేషన్లకు వెళ్లి పరామర్శించారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలుచేయాలని నిరసనకు ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, స్కీమ్‌లను గతంలో మాదిరిగానే అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీల పోరాటానికి బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడిపై పెంచుతామని హెచ్చరించారు.
జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని, 14 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.7వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరకాలంగా శాంతియుత దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే బీసీ శ్రేణులు సచివాలయం ముట్టడికి యత్నించాయని తెలిపారు. గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు.