రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్లీ మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు హడావుడిగా, అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటివరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనే సాక్ష్యం. కులగణన అంశం తమదేనని, రాష్ర్టాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత, సాధికారత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చిచెప్పింది. కాంగ్రెస్ సర్కారు తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టారీతిన, తప్పులతడకగా ఇంటింటి సర్వేను నిర్వహించడమే కాకుండా, ఆ అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణనే చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం అసాధ్యమని తేలింది.
Panchayat Elections | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకా రం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో, ర్యాండమ్‌గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తుండగా ప్రతిసారీ వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది.
ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కే కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు పలు స్పష్టమైన ఆదేశాలను, ట్రిపుల్ టీ పేరిట పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అందు లో మొదటిది ప్రతీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడవది రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తంగా 50% మేరకు మించవద్దు. వాటినే ట్రిపుల్ టీ అంటారు. ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ర్టాల్లో స్థానిక ఎన్నికలను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
‘అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన నిర్వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణనూ అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. కులగణన చేసే అధికారం రాష్ర్టానికి లేదని తెలిసినా కేవలం ఓట్ల కోసమే హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత న్యాయనిపుణులు, బీసీ సంఘాల మేధావులు చెప్పినా వినకుండా అశాస్త్రీయమైన రీతిలో కులగణన నిర్వహించింది.
క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్థూలంగా గణాంకాలను ప్రకటించింది. కులాలు, ఉపకులాల వారీగా లెక్కలను వెల్లడించలేదు. ఇప్పటివరకు సర్వే నివేదికనే బహిర్గతం చేయలేదు. ఆ అసంబద్ధమైన గణాంకాలనే డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసింది. ఆ గణంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. ఆ నివేదికను సర్కారు బయటపెట్టలేదు.
కమిషన్ నివేదిక ఆధారంగా సర్కారు హడావుడిగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం మాత్రం తాజాగా అందుకు విరుద్ధమైన ప్రకటనను జారీచేసింది. రాష్ర్టాల కులగణనకు సాధికారత లేదని తేల్చిచెప్పింది. అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పంపిన బిల్లులను కేంద్రం ఆమోదించబోదని తేలిపోయింది. వెరసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అందని ద్రాక్షగానే మరోసారి మిగిలిపోనున్నది.
కాంగ్రెస్ తీరుతో ఇప్పుడు పాత రిజర్వేషన్లకూ ఎసరు వచ్చి పడింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని స్పష్టంచేసింది. ఆ మేరకు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశం ఉన్నది. కానీ ఈ పాత రిజర్వేషన్లను అమలు చేయాలన్నా ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు తప్పనిసరి. లేదంటే మొత్తంగా బీసీలకు గతంలో అమలుచేసిన 22.79% బీసీ రిజర్వేషన్ సీట్లు కూడా జనరల్ స్థానాలుగానే మారే ప్రమాదం ఉన్నది.