హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం ఫలితంగానే కేంద్రం దిగొచ్చి సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి ముందుకొచ్చిందని, నేడు ట్రిబ్యునల్‌లో ఆ దిశగానే వాదనలు కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందని సామాజిక కార్యకర్త, ఎన్జీటీ పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్- 89 ప్రకారం ప్రాజెక్ట్‌ల వారీగా నదీజలాల పంపిణీని తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ సరార్ మొదటి నుంచీ వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే, అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం 1956 సెక్షన్-3 ప్రకారం నదీజలాలను పునఃపంపిణీ చేయాలని కేసీఆర్ పట్టుబట్టారని, రాష్ట్ర ఏర్పాటు తరువాత సెక్షన్ 3 కోసం ఎంతో పోరాటం చేశారని కొనియాడారు.
ఈ అంశాన్ని కేంద్రం నాన్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిందని తెలిపారు. ఆ తరువాతే కేంద్రం స్పందించిందని, కేసు వాపస్ తీసుకుంటే సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. కేంద్రం సూచనతో సుప్రీంకోర్టులో పిటిషన్ వాపస్ తీసుకున్నారని, తదనంతరమే కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నూతన మార్గదర్శకాలను జారీచేసిందని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సమాజం విజయమని గవినోళ్ల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటి తరలింపునకు తీవ్రంగా కృషి చేసి, ట్రిబ్యునల్‌తో జైలుకు పంపాల్సి వస్తుందని చివాట్లు తిన్న నాటి ఏపీ నీటిపారుదల కార్యదర్శి, అప్పటి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్నే, తిరిగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారుడిగా కాంగ్రెస్ సర్కార్ నియమించిందని, ఇంతకంటే ఘోరం మరేమీ ఉండబోదని దుయ్యబట్టారు.
రెండేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ తరఫున ఉండటం వైచిత్రమని విమర్శించారు. ట్రిబ్యునల్ ఎదుట ఎలా బలమైన వాదనలు వినిపిస్తాడని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదిత్యనాథ్‌దాస్‌ను తొలగించాలని, లేదంటే కనీసం ట్రిబ్యునల్ వాదనలకు దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులను సరిదిద్దుకొని, ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించాలని, కృష్ణా నీటి వాటా 50 శాతాన్ని సాధించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.