Paddy Procurement | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత వానకాలం సీజన్‌తో పోల్చితే, ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. నిరుడు బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇదే సమయానికి భారీ మొత్తంలో ధాన్యం కొనుగోళ్లు చేయగా, ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. వాటిని విక్రయించేందుకు రైతు లు పడిగాపులు కాస్తున్నారు. అనేకచోట్ల పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కాంటాలు పెట్టేవారు కానీ, కొనుగోలు చేసే దిక్కుకాని లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిరుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ రెండో వారం నాటికి రైతుల నుంచి సుమారు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటివరకు 18 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే సమయంలో రెండున్నర లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, కాంగ్రెస్ సర్కారు 2,546 మంది నుంచి మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ఈ లెక్కన బీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేసిన ధాన్యంలో కాంగ్రెస్ సర్కారు 1.2 శాతమే కొనుగోలు చేయడం గమనార్హం.
మిల్లర్లతో ఒప్పందం కాకుండా కొనుగోళ్లు ఎలా?
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుసార్లు అధికారులను ఆదేశించారు. కానీ, కొనుగోళ్లకు అత్యంత ముఖ్యమైన మిల్లర్లతో ఒప్పందం కాకుండా ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం లాభం? అసలు సమస్యను పరిష్కరించకుండా ప్రకటనలు జారీ చేస్తే ప్రయోజనం ఏమిటి? ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు మిల్లర్లతో ఒప్పందాలే జరగలేదు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఒప్పందాలు చేసుకోబోమని, ధాన్యం దించుకోబోమని మిల్లర్లు తెగేసి చెప్తున్నారు. సన్నబియ్యం అవుట్టర్న్ను తగ్గించాలని, బ్యాంకు గ్యారెంటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీరి సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎవరు దించుకోవాలనేది ప్రశ్నగా మారింది. ఈ విధంగా ధాన్యం దించుకునేవారు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కాంటా పెట్టడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కొన్నది 18 వేలు.. కొనాల్సింది 80 లక్షల టన్నులు
అక్టోబర్ 1వ తేదీ నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన కొనుగోళ్లు ప్రారంభించి నెల దాటింది. అయినప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 18 వేల టన్నులు మాత్రమే. ఈ సీజన్లో 1.50 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని, ఇందులో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. 18 వేల టన్నులకే నెల రోజుల సమయం పడితే, ఇక 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఎంత సమయం పడుతుందనేది జవాబులేని ప్రశ్న.
ప్రైవేటుకే సన్నధాన్యం.. సర్కారుకు కష్టమే
జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఈ సీజన్లో 50 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించింది. అయితే సర్కారు లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే మెజార్టీ సన్న ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు 30 లక్షల టన్నుల వరకు వ్యాపారులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సన్నధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కవ భాగం వ్యాపారులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్కారుకు సన్న ధాన్యం రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వస్తే 10-15 లక్షల టన్నుల రావొచ్చని అంటున్నారు. కానీ, సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి 36 లక్షల టన్నుల ధాన్యం అవసరం. ఈ నేపథ్యంలో సన్నబియ్యం హామీని ఏ విధంగా అమలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెసోళ్లు వచ్చి ముంచిండ్రు
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండేదయ్యా.. అన్ని పథకాలు టైముకు వస్తుండె. కాంగ్రెసోళ్లు పంట పెట్టుబడి పైసలివ్వలేదు. ఇప్పుడు కూడా ఇయ్యమంటున్నరు. ఈ సారి ఇంత వానలు కురవకపోతే నిండా మునిగేటోళ్లం. ఈ సర్కారు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదు. కేసీఆర్ సారే మళ్లీ రావాలి.
-నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో మహిళా రైతులు