Telangana | రంగారెడ్డి, మార్చి 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల నోటికాడి ముద్దను లాగేసుకొనే పన్నాగం పన్నింది. ఈ మేరకు 350 మంది రైతులకు చెందిన 1,248 ఎకరాల భూమి సేకరణకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది. ఫలితంగా ఎన్నో ఏండ్లుగా ఆ భూములనే నమ్ముకొని జీవిస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదే జిల్లాలో ఓ వైపు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతుండగా.. వాటిని లెక్కచేయని సర్కార్ మరో భూసేకరణకు సిద్ధంకావడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో 1,248 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం శనివారం మరో నోటిఫికేషన్ జారీచేసింది. గ్రామంలోని ఆలూరు-1, ఆలూరు-2, ఆలూరు-3లో ప్రభుత్వం భూసేకరణకు తెరలేపింది. గ్రామంలోని సర్వేనంబర్ 23, 24, 84, 85, 92, 99, 94, 95, 88, 89, 100, 101, 107, 108, 109, 110, 112, 1112, 113, 114, 118, 117, 119, 120, 121, 122 మొదలుకొని 141లో గల భూములను పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీచేసింది. పారిశ్రామిక కారిడార్, రేడియల్ రోడ్ల కోసం ఈ భూములను సేకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో వక్ఫ్‌బోర్డు భూములను తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆలూరు-1లో 58 సర్వేనంబర్ల నుంచి 510 ఎకరాలు, ఆలూరు-2లోని 35 సర్వేనంబర్ల నుంచి 310 ఎకరాలు, ఆలూరు-3లోని 31 సర్వనంబర్ల నుంచి 357 ఎకరాలు, ఇతర సర్వేనంబర్లలో 71 ఎకరాల భూముల కోసమే ఈ నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో ఇవే భూములకోసం నోటిఫికేషన్ జారీచేసింది. వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఈ అంశం మరుగునపడింది. తిరిగి మళ్లీ ఈ భూములపై తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వరుసగా భూసేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో రైతులకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు అభివృద్ధి పార్కులతో యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీచేసింది. కందుకూరు మండలం తిమ్మాపూర్ 38లో 350 ఎకరాలు, సర్వేనంబర్ 162లో 217 ఎకరాలు, మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో 195 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో సర్వేనంబర్ 9లో 366 ఎకరాలు, కొంగరకుర్దులో సర్వేనంబర్ 89లో 277 ఎకరాలు, యాచారం మండలం మొండిగౌరెల్లిలో 821 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రభుత్వం వరుస భూసేకరణలతో పేద, మధ్యతరగతి రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత ప్రభుత్వాలు పేదలకు పంచిన అసైన్డ్, భూదాన్, వక్భ్‌బోర్డు భూములే లక్ష్యంగా చేసుకొన్న ఈ సర్కార్ వాటి సేకరణకు మొగ్గుచూపుతున్నది. దీంతో ఆ భూములనే నమ్ముకున్న వేలాది మంది రైతులు జీవనోపాధిని కోల్పుతున్నామని ఆందోళన చెందుతున్నారు. తాగాగా ఆలూరు గ్రామంలోని సుమారు 350 మంది రైతులు తమ భూములకు సర్కార్ ఎసరు పెట్టేందుకు ముందుకొచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో భూసేకరణను వ్యతిరేకిస్తూ అనేక గ్రామాల్లో బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ రైతుల మొర ఆలకించడమే లేదు. భూసేకరణకే మొగ్గు చూపుతున్నది. ఇప్పటికే యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. వాటిని లెక్కచేయని సర్కార్.. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో భూసేకణకు తెరలేపడంతో బాధిత రైతుల్లో గుబులు పట్టుకొన్నది.