హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/వరంగల్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వవస్థీకరణ అసలు స్వరూపం, అంతరార్థం అదేనని మండిపడుతున్నారు. ఆంధ్రా‘బాబు’ డైరెక్షన్లో రేవంత్‌రెడ్డి నడుచుకుంటున్నారని, దీనివెనుక తెలంగాణబిడ్డల ఉద్యోగాలు కొల్లకొట్టే భారీ కుట్ర ఉందని నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆంధ్రా, రాయలసీమ వారికి రెడ్‌కార్పెట్ పర్చడం ఖాయమని, ఇదే జరిగితే తెలంగాణబిడ్డలు తీవ్ర అన్యాయమైపోతారని, నష్టం జరుగుతుందని వాపోతున్నారు.
ఈ విషయంలో సర్కార్ ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నదని, మొదట ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం, తర్వాత మూడు కార్పొరేషన్లు, సికింద్రాబాద్ జిల్లా.. అంటూ రోజుకో లీకు వదులుతున్నారని జేఏసీ నేతలు ఉదహరిస్తున్నారు. రెండేండ్లుగా లేనిది ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జిల్లాల పునర్విభజనను తెరపైకి తేవడం వెనుక ఇదే కుట్ర ఉందని, కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక పెద్దఎత్తున ఆంధ్రా నేపథ్యమున్న అధికారులకు పోస్టింగ్‌లు, పదవులిచ్చిందని, ఇక ఉద్యోగాలు కట్టబెట్టబోతున్నదని జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలోని బెవరేజెస్, సివిల్ సప్లయీస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ డెవలప్మెంట్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గిడ్డంగుల సంస్థ వంటి కార్పొరేషన్లతో పాటు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ ఎడ్యుకేషనల్ సొసైటీల్లోని ఒక్కో దాంట్లో ఒక్కో పద్ధతి నడిచింది.
వీటన్నింటికి తెలంగాణ రాష్ట్రసాకారంతో కేసీఆర్ సర్కార్ చరమగీతం పాడింది. ఆయా సంస్థల్లో 95 శాతం స్థానిక కోటాను వర్తింపజేసింది. జోనల్, మల్టీజోనల్ విధానంతో చక్కటి పరిష్కారం దొరికింది. దీంతో స్థానికేతరులు తెలంగాణలో ఉద్యోగాలు దక్కించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పదేండ్ల కాలంలో భర్తీ చేసిన ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలే దక్కించుకున్నారు. తెలంగాణపై కన్నేసి, ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టాలన్న తలంపుతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డితో తాజా తతంగం నడిపిస్తున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే మళ్లీ పాతరోజులు, నాటి అసమానతలు, అన్యాయాలు తెరమీదికి రావడం ఖాయమని పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం కేవలం రెండు జోన్లతో ఆవిర్భవించింది. ఫలితంగా స్థానికులకు 70 శాతం, ఓపెన్ క్యాటగిరీలో 30 శాతం పోస్టులు ఉండేవి. ఓపెన్ క్యాటగిరీలో ఎవరైనా ఉద్యోగాలు తన్నుకుపోవచ్చుననే ప్రమాదం గ్రహించిన కేసీఆర్ కేంద్రంపై పోరాడి 95 శాతం ఉద్యోగాలు స్థానికుల(తెలంగాణ)కే దక్కేలా సాధించారు. 2014 నుంచి 2021 దాకా అడ్డంకులు, చిక్కుముడులు తొలగించి ఆర్టికల్ 371(డీ)(1),(2) క్లాజుల కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఎంప్లాయిమెంట్ ఆర్డర్‌ను రూపొందించింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ) ఆర్డర్‌కు 2018 కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేయగా 7 జోన్లు ఏర్పాటయ్యాయి. జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా, కేసీఆర్ సర్కార్ 2018 ఆగస్టు 30న నూతన జోనల్ విధాన మార్గదర్శకాలు విడుదల చేసింది. తరువాత అనూహ్యంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపాలనే విజ్ఞప్తులు రావటమే కాకుండా కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్రప్రభుత్వం 2018లో సవరణలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రం ఆమోదానికి పంపగా మూడేండ్ల నాన్చివేతతో 2021ఏప్రిల్‌లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అదే సంవత్సరం జూన్30న కొత్తజోన్లు, మల్టీజోన్లతో కూడిన జీవోను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 33 జిల్లాలు, 7జోన్లు 2మల్టీజోన్లలో జరిగే నియామకాలు, ఉద్యోగోన్నతులతో కొత్తజోనల్ విధానం అమలు చేయాలని జూలై 22న ఆదేశాలు సైతం ఇచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి సమానావకాశాలు కల్పించడంతో పాటు సామాజికన్యాయం అమలైంది.
తెలంగాణ కుత్తుకపై చంద్రబాబు కత్తి రేవంత్ రూపంలో వేలాడుతున్నదనే అనుమానాలకు బలం చేకూరే పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయని, అదే జరిగితే 2009లో ఫ్రీజోన్ వ్యవహారంపై నెగడై మండినట్టే పునరావృతం అవుతుందని మేధావులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీజలాలు యథేచ్ఛగా కొల్లగొట్టేందుకు పాచిక వేసినట్టే మళ్లీ హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం బాబు చెప్పుచేతుల్లో ఉండటం, తెలంగాణలో జవదాటని శిష్యుడు రేవంత్ సీఎంగా కొనసాగడమే అందుకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. కేసీఆర్‌పై పగ సాధించటానికి తద్వారా తెలంగాణపై పెత్తనం చెలాయించడానికి ఇంతకన్నా అనువైన సమయం లేదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ నాయకుడు జరుగుతున్న పరిణామాలను విశ్లేషించారు. చంద్రబాబు పాచికలాటలో భాగంగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చిందని, కృష్ణానదిలో 91 టీఎంసీల వాటాను రాష్ట్రప్రభుత్వం 45 టీఎంసీలకు కుదించటం వంటి పరిణామాలను సదరు నేత వివరించారు. వాటి కొనసాగింపులో భాగమే జిల్లాల పునర్విభజన అని ఉదహరిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఫ్రీజోన్ పేరిట జరిగిన అన్యాయాలు కోకొల్లలు. రాజధాని, హెడ్‌క్వార్టర్, హైదరాబాద్ ఫ్రీజోన్ పేరుతో జరిగిన అక్రమాలు అనేకం. స్టేట్క్యాడర్ పోస్టుల పేరిట ఉద్యోగాలు కొల్లగొట్టడం, హైదరాబాద్‌లోని పోస్టులు అన్ని జిల్లాల వారు ఎగరేసుకుపోయిన ఉదంతాలున్నాయి. రాష్ట్రప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు ఉండేవన్నీ రాజధానిలోనే. హెడ్‌క్వార్టర్‌లో ఉన్నాయన్న సాకు చూపించి వాటిల్లో ఉద్యోగాల భర్తీ సమయంలో స్థానిక కోటాను వర్తింపజేయలేదు. దీంతో అనేక కార్పొరేషన్లల్లో స్థానికేతరులు ఉద్యోగాలు పొందారు. గతంలో స్థానిక కోటాఇష్టారీతిన ఉండేది. పలుశాఖల్లో 60 -80శాతం మాత్రమే స్థానిక కోటాలో రిజర్వేషన్లు అమలయ్యేవి. ఒకశాఖలో 60 శాతం లోకల్ కోటా ఉంటే, మరోశాఖలో 80 శాతముండేది. ఇలా ఒక్కోశాఖలో ఒక్కో రూల్ అన్నట్టుగా నడిచింది.
జోన్ -1 కాళేశ్వరం జోన్ : ఆసిఫాబాద్- కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ -భూపాలపల్లి, ములుగు
జోన్ -2 బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
జోన్ – 3 రాజన్న జోన్: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
జోన్ – 4 భద్రాద్రి జోన్ : కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ
జోన్ – 5 యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిభువనగిరి, జనగామ
జోన్ – 6 చార్మినార్ జోన్ : మేడ్చల్ – మలాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
జోన్ -7 జోగులాంబ జోన్ : మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్
జోన్ -1 కాళేశ్వరం జోన్ : ఆసిఫాబాద్ కుమ్రంభీం, జయశంకర్-భూపాలపల్లి, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు
జోన్ -2 బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
జోన్ -3 రాజన్న జోన్ : కరీంనగర్ కమిషనరేట్, సిద్దిపేట కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
జోన్ -4 భద్రాద్రి-కొత్తగూడెం జోన్ : ఖమ్మం కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్
జోన్ -5 యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్
జోన్ -6 చార్మినార్ జోన్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్
జోన్ -7 జోగులాంబ జోన్ : మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల-జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలు