హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోచుకొన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీని తాము నిరూపిస్తామని, ప్రభుత్వం తక్షణమే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు రూ.120 నుంచి రూ.250 వరకు రైతులు నష్టపోయారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధర్మకాంటా తూకాలను పరిగణనలోకి తీసుకొంటే వాస్తవాలన్నీ బయటపడుతాయని స్పష్టంచేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రైతాంగం తీవ్ర ఇకట్లకు గురవుతున్నదని ఆరోపించారు. కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పిస్తున్నదే తప్ప క్షేత్రస్థాయిలో రైతులకు దకిందేమీ లేదని తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, స్వరాష్ట్రంలో కేసీఆర్ రైతులకు అండగా నిలబడి ఆదుకొన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పించుకొనేందుకే కుంటిసాకులు వెతుకుతున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇప్పటికే సాగులో ముందుకు సాగలేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం కేవలం 7 సన్నరకాల పంటలనే సాగు చేయాలని ఆంక్షలు పెట్టడం సరికాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు. దిగుబడి లేని పంటలను సాగు చేయాలంటే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం సూచించే ఆ ఏడు రకాల పంటలకు చీడపురుగుల సమస్య కూడా అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 33 సన్న రకాలను గుర్తించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఏడింటికే కుదించడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు ఏ రకమైన పంట సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకాన్ని, భరోసాను రైతులకు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ఖరీఫ్‌లోనైనా రైతు భరోసా రూ.15,000 చొప్పున వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం బోనస్ ఇవ్వడాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని విమర్శించారు. రైతు బీమా ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘యూరియా యా ప్ ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఇక సామా న్యులకు ఏమి అర్థమవుతుంది?’ అని పేర్కొన్నారు. ఈసారైనా రైతులు యూరియా కోసం పడికాపులు కాయకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముందు ధాన్యం పోసి ధర్నా చేస్తానన్న రేవంత్.. ఇప్పుడు సీఎం అయ్యాక ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.