సుబేదారి, అక్టోబర్22 : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల(Congress) అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆపార్టీ నాయకులు, వారి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తున్న నమస్తే తెలంగాణ( Namaste Telangana) పత్రికపై ద్వేషం పెంచుకొని దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు వరంగల్ మడికొండలోని నమస్తే తెలంగాణ యూనిట్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు.
150 మంది యూత్ కాంగ్రెస్ జెండాలతో వచ్చి, పత్రిక ప్రతులను చింపి వేసి దౌర్జన్యం సృష్టించారు. ఆఫీస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నం చేయగా ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బందిని, మహిళని బూతులు తిట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల పై వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరించి, గంటపాటు బీభత్సం సృష్టించారు. చివరికి మడికొండ పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై యూనిట్ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది మడికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.