హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆమె ఖండించారు. సీఎం ప్రోద్భలంతోనే కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదురోలేక కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. భౌతి క దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. ఈ దాడిని పిరికిపంద చర్య గా అభివర్ణించారు. రాహుల్‌గాంధీ వల్లించే మొహబ్బత్ కీ దుకాన్ ఒక బూటకమని తేటతెల్ల మైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమని ధ్వజమెత్తారు. విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ విష సంసృతికి ఈ డాడి నిదర్శనమని, సిగ్గుమాలిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని, తమ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.