రవీంద్రభారతి, అక్టోబర్ 23: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే… జీవోను అడ్డుకున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. రెడ్డి జాగృతి సంస్థ నాయకుడితో హైకోర్టులో పిటిషన్ వేయించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అఖిలపక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్లి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. బీసీ బిల్లుపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ సదస్సులు, నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, ఏపీ ఇన్చార్జి నూకాలమ్మ, నాయకులు ఆదిశేషు, రాజు, వరప్రసాద్, చక్రధర్, సాయికుమార్, అప్పయ్యబసన్న, రాంబాబు, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.