నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9 : అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేశారని, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ వెయ్యి రోజుల దగాపై బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పోరుబాట నిర్వహించారు. ఈ సందర్భంగా పాత మార్కెట్ నుంచి ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
బస్‌స్టాండ్ నుంచి శ్రీపురం చౌరస్తా మీదుగా అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష కోట్లతో మూసీనదిని సుందరీకరణ చేసేందుకు పూనుకున్న రేవంత్ సర్కార్ విద్యార్థులకు 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. పదోతరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.20 వేలు, డిగ్రీ పాసైతే రూ.30 వేలు పారితోషికం ఇస్తామన్న హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని రానీయొద్దనే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులు అని చూడకుండా వారిని మగ పోలీస్ అధికారులు నెట్టడం, మహిళా ఎమ్మెల్యేల చీరపట్టి లాగడం వంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.