కేసీఆర్ పాలనపై విషం చిమ్ముతూనే.. ఆయన చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకూ మంత్రులు వెనకాడటం లేదు. తాజాగా పొంగులేటి తీరు రంగులు మార్చే కాంగ్రెస్ ఓట్ల రాజకీయాన్ని బయట పెట్టింది. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లనే కట్టలేదని ఉదయం ప్రచారంలో చెప్పుకొచ్చిన మంత్రి.. సాయంత్రం అదే కేసీఆర్ కట్టిన కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద శిలాఫలకాలు వేసుకుని తమది జిమ్మిక్కుల సర్కార్ అని మరోసారి నిరూపించుకున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొన్నిరోజుల క్రితం యూసుఫ్‌గూడలో ప్రచారం నిర్వహించినప్పుడు ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆయన ప్రచారం నిర్వహించిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే ఉన్న రహ్మత్‌నగర్ డివిజన్ కమలానగర్లో 270 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఉన్నది. గతంలో అక్కడ గుడిసెలు ఉంటే కేసీఆర్ ప్రభుత్వం వాటిని తొలగించి అక్కడే ఆ కుటుంబాలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని నిర్మించి పంపిణీ చేసింది. వీరితోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 500 మంది చొప్పున అంటే మూడు వేల మంది నిరుపేదలకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఇండ్లను కేటాయించి, పంపిణీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మూడువేల నిరుపేద కుటుంబాలు రెండేండ్లుగా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ప్రశాంతంగా జీవిస్తున్నాయి.
ఓట్ల కోసం మరోసారి మాయమాటలు
కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మూడు వేల కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడ దాదాపు ఎనిమిదివేలకుపైగా ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. అందుకే జూబ్లీహిల్స్ ప్రచారంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇయ్యలేదన్న మంత్రులు ఓట్ల కోసం మాత్రం కొల్లూరులో వాలారు. 22 నెలలుగా తమకు సౌకర్యాలు కావాలని వేడుకున్నా పట్టించుకోని మంత్రులు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓట్ల కోసం శిలాఫలకాలు వేశారు. రూ.50 లక్షలతో శ్మశానవాటిక, రూ.3 కోట్లతో పార్కు, రూ.4 కోట్లతో జడ్పీ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అంతేకాదు, పది రేషన్ దుకాణాలు, నాలుగు అంబులెన్స్‌లు, ఒక పోలీస్ అవుట్‌పోస్టు, ఒక అంగన్వాడీ కేంద్రం ఇలా రాత్రికి రాత్రి కోరికలన్నీ తీరుస్తామంటూ హడావుడి చేస్తున్నారు. సాంకేతికంగా కొల్లూరు ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి రానప్పటికీ, నియోజకవర్గానికి చెందిన దాదాపు ఎనిమిది వేల మందికిపైగా ఓటర్లు ఉన్నచోట మంత్రులు ఇలా వారిని ప్రలోభపెట్టే రీతిలో కార్యక్రమాలు నిర్వహించడం అధికార దుర్వినియోగమే కాకుండా ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

చూసిండ్రా… మంత్రి పొంగులేటి డబుల్ యాక్షన్. ఒక్క పూటలోనే రంగు మార్చిండు. ఉదయం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యలేదన్న అదే మంత్రి… జూబ్లీహిల్స్ ఓట్ల కోసం కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర వాలిండు. మరి నిజంగా కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యకుంటే ఆగమేఘాల మీద కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర శంకుస్థాపనలు ఎందుకు చేయాల్సి వచ్చింది?! జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మంత్రులు, నేతల మాటలు అబద్ధాల మూటలు అనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?!
తేదీ: 03.11.2025, ఉదయం సుమారు 9 గంటలు

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దృశ్యమిది. ‘పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్క నిరుపేదకు కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదు. మేం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అసలు జూబ్లీహిల్స్‌లో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు…’ ఇదీ ఆయన ప్రసంగ సారాంశం.
తేదీ: 03.11.2025, సాయంత్రం 4.30 గంటలు

ఇది… నగర శివారులోని కొల్లూరులోని ఆసియాలోనే అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి విలువ రూ.50 లక్షల పైమాటే. అలాంటివి నయాపైసా లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వేలాది మంది నిరుపేదలకు ఉచితంగా ఇచ్చింది. ఇందులో జూబ్లీహిల్స్ నియోజకర్గానికి చెందిన మూడువేల మంది నిరుపేద లబ్ధిదారులు కూడా ఉన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ రూ.7.5 కోట్ల పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ సోమవారం సాయంత్రం శిలాఫలకాలు వేశారు.