హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖను ‘పెద్దలు’ డైవర్షన్ పాలిటిక్స్‌కు వాడుకున్నారా? కేటీఆర్‌పైకి మంత్రిని ఎగదొస్తే మూసీ, హైడ్రా లొల్లి డైవర్షన్ అవుతుందని లెక్కలేసుకున్నారా? వీళ్ల డైవర్షన్ డ్రామా కాస్తా బూమారాంగ్ అయిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌పై, అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల వెనుక ‘పెద్దలు’ ఉన్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమెను అడ్డంపెట్టుకొని మూసీ, హైడ్రా నష్టాన్ని పక్కదారి పట్టించాలని పక్కా ప్లాన్ వేసినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి కొండాను రెచ్చగొట్టి మాట్లాడించారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ‘పెద్దలు’ చెప్పారనే ఆనందంలో రెచ్చిపోయిన సురేఖ హద్దులు మీరి నోటికి పనిచెప్పారు. హద్దు అదుపు లేకుండా అక్కినేని కుటుంబంపై, మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు అప్పటికే జనాల్లోకి వెళ్లడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించిన పెద్దలు నష్టనివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది.
బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సీఎం, మంత్రులు బాపూఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు. మంత్రి కొండా సురేఖ మాత్రం మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇవి మీడియాలో హైలైట్ కావడంతో ‘పెద్దల’కు ఓ ఆలోచన తట్టింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శల తీవ్రత పెంచితే మూసీ, హైడ్రా వివాదం పక్కదారి పడుతుందని ప్లాన్ వేశారు. దీంట్లో భాగంగానే కొండా సురేఖను రెచ్చగొట్టినట్టుగా తెలిసింది. బాపూఘాట్ నుంచి గాంధీభవన్‌కు వచ్చిన ఆమెకు పెద్దలు ఫోన్ చేసి కేటీఆర్‌పై విమర్శల దాడి పెంచాలని సూచించినట్టు తెలిసింది. ఓవైపు వ్యక్తిగత ఆక్రోశం.. మరోవైపు పెద్దల అండ, ఆదేశం.. ఇంకేముంది సురేఖ రెచ్చిపోయారు. మీడియాతో ముందు వెనక చూసుకోకుండా, ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించకుండా అక్కినేని కుటుంబంపై విపరీత వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం పెద్దలు తీవ్రం గా పరిగణించినట్టు తెలిసింది. అంతకు ముం దు ‘ఫైర్‌బ్రాండ్’గా పేరున్న ఓ మహిళా నేత ఈ ఘటనపై నేరుగా అధిష్ఠానం పెద్దలకే ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అసలు ఈ వ్యాఖ్యలేంటి? ఈ పాలనేంటి అని నిలదీసినట్టుగా తెలిసింది. అక్కినేని కుటుంబం చాలా పెద్దదని, దక్షిణ భారతదేశంలో వాళ్ల ప్రభావం ఉంటుందని చెప్పినట్టుగా తెలిసింది. అలాంటి కుటుంబంపై మహిళా మంత్రి ఇంత నీచంగా మాట్లాడటంపై పార్టీ పరువు పోతుందని, వాళ్ల ను కట్టడి చేస్తారా? లేదా? అని నిలదీసినట్టు తెలిసింది. మీ నుంచి అవుతదా? లేదా? అం టూ నేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో ఏం జరిగిందనే అంశంపై రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే అక్కినేని అమలకు ప్రియాంకగాంధీ ఫోన్ చేసినట్టుగా తెలిసింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆమె.. బాధపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారట. ఈ వ్యవహారంపై తేల్చాలని కేసీ వేణుగోపాల్‌ను ఆదేశించినట్టుగా తెలిసింది. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫోన్ చేసిన వేణుగోపాల్.. ఈ వ్యవహారంపై తలంటినట్టుగా తెలిసింది. పూర్తి వివరాలను తెలుసుకున్న అధిష్ఠానం పెద్దలు మంత్రి కొండా సురేఖ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బాధ్యత గల పదవిలో ఉంటూ, పైగా మహిళా మంత్రిగా ఉంటూ సా టి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. మంత్రులను అదుపులో పెట్టలేరా? అంటూ ఇటు సీఎం రేవంత్‌రెడ్డిని, అటు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతతో పార్టీకి జరిగిన నష్టం చాలదన్నట్టుగా ఇప్పుడు ఈ కొత్త తలనొప్పి అవసరమా అని ప్రశ్నించినట్టుగా తెలిసింది. మీ వ్యవహారంతో రాష్ట్రం లో పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టు నివేదిక అందిందని మందలించినట్టు తెలిసిం ది. ఇప్పటికే జరిగిన నష్టం చాలని, ఇకపై ఈ వ్యవహారానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. మొత్తం ఘటనపై పార్టీ తరుఫున వివరణ ఇవ్వాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదేశించినట్టు విశ్వసనీయం గా తెలిసింది. దీంతో ఆయన గురువారం ఉద యం ఈ ఘటనను ఖండిస్తూ వీడియోను వి డుదల చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా, మంత్రులను అదుపులో పెట్టేందుకు అవసరమైతే సురేఖపై చర్యలకు కూడా వెనకాడొద్దని ఆదేశించినట్టుగా తెలిసింది.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను నిరసిస్తూ భద్రాద్రి జిల్లా ఇల్లెందులోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద గురువారం ఆమె దిష్టిబొమ్మను బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, మహిళా కౌన్సిలర్లు దహనం చేశారు. నటి సమంత గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మండిపడ్డారు. – ఇల్లెందు రూరల్
సినీ నటుడు నాగార్జున కుటుంబాన్ని అవమానించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరం సృష్టిస్తున్నాయి. ఆమె చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్లో పోస్టులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పార్టీ అధిష్ఠానం పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. నాగార్జున కుటుంబంపై, మహిళలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఆమె వ్యాఖ్యల్ని ఛీత్కరిస్తున్నారు. ‘నా 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవరూ, ఎప్పుడు ఇంత దిగజారి మాట్లాడింది చూడలేదు. ఆమె మా పార్టీ మంత్రి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది.’ అని సీనియర్ నేత ఒకరు వ్యా ఖ్యనించడం గమనార్హం. ఇదే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మౌనాన్ని పాటిస్తున్నారు. ఇంత దుమారం చెలరేగినా ఆయన మాట కూడా మాట్లాడటం లేదు. మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కనీసం ప్రకటన కూడా చేయలేదు. రేవంత్ మౌనానికి గల కారణం ఏమిటన్న చర్చ జరుగుతున్నది. అనేక అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. హైడ్రా, మూసీ వివాదాలను పక్కదారి పట్టించేందుకు ఆయనే డైవర్షన్ పాలి‘ట్రిక్స్’కు తెరతీశారని పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖతో ఈ ఘాటు వ్యాఖ్యలు చేయించారన్న అనుమానం వస్తున్నది. ‘పెద్దల’ అనుమతి లేకుండా ప్రముఖుల కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఓ మంత్రి సాహసిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే కొండా వ్యాఖ్యలు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.