అక్టోబర్ 2 గాంధీ జయంతి..! ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిరోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ప్రవచించిన బాపూజీ పుట్టిన రోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ, సాటి మహిళ అయిన సినీనటి సమంతను నడిరోడ్డుకీడ్చి అవమానించింది. నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం! ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ, ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది.
Congress | మహిళై ఉండీ, మంత్రిగా ఉండీ.. సభ్యత, సంస్కారాన్ని మరిచి కొండా సురేఖ సాటి మహిళలపై హీనమైన వ్యాఖ్యలు చేశారు. స్థాయిని, హోదాను మరిచి దిగజారుడు భాష వాడారు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను, వారి వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సినీ తార సమంతపై సాటి మహిళగా చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవిత అంశాలను ప్రస్తావించి శీలహననానికి పూనుకున్నారు. గాంధీజయంతి రోజున గాంధీభవన్ వేదికగా మంత్రి వాడిన జుగుప్సాకర భాషపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పౌరసమాజం, కొండా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. రెండురోజుల క్రితం ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే గగ్గోలు పెట్టారు సురేఖ. మహిళలను కించపరుస్తారా.. అంటూ నానాయాగీ చేశారు. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై సానుభూతి చూపుతూ ఆ పోస్టును తప్పుపట్టారు. అలాంటిది సాటి మహిళలపై ఆమె స్వయంగా రాయలేని, చెప్పలేని భాషలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె ఒక్కరే మహిళ అన్నట్టు.. అటు నాగార్జున కుటుంబంలోకానీ, ఇటు కేటీఆర్ కుటుంబంలో మహిళలే లేనట్టు అత్యంత హీనంగా ఆమె మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొండా సురేఖ వ్యాఖ్యలతో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పరువు పోయింది. ఇప్పటికే మూసీ కూల్చివేతలతో జాతీయస్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్న రేవంత్ సర్కార్.. సురేఖ వ్యాఖ్యలు మరింత పరువును పోగొట్టుకున్నది. పదేండ్లు హుందాగా నడిచిన తెలంగాణ రాజకీయాల్లో.. గత పదినెలలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు, జుగుప్సాకర భాష నిత్యకృత్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నోటినుంచే అసహ్యకర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చట్టసభల్లోనూ చవకబారు మాటలు వినిపించాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రౌడీమూకల దాడుల సంస్కృతి, రాజకీయ హింస మొదలైంది. ప్రజాజీవితంలో ఉండీ, ప్రభుత్వ వైఫల్యాలను ధీటుగా ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, కేటీఆర్ తదితర నేతలే లక్ష్యంగా ఈ వ్యక్తిగత దాడులు ప్రధానంగా కొనసాగాయి. వాటిలో మరీ దిగజారుడుగా కొండా సురేఖ వ్యాఖ్యలున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై సభ్యసమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంటే.. కొన్ని చానళ్లు మాత్రం కనీస ప్రమాణాలు పాటించకుండా ఆ వ్యాఖ్యల్ని అలాగే ప్రసారం చేశాయి. ఇదేం నీతిమాలిన జర్నలిజం? ఇవేం పాత్రికేయ ప్రమాణాలు?
సినీ హీరోయిన్లు, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఈ విషయం తెలియడంతోనే అధిష్టానం పెద్ద ఒకరు నేరుగా కొండా సురేఖకు, పీసీసీ కీలక నేతకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించినట్టుగా సమాచారం. ఇప్పటికే మూసీ, హైడ్రాతో పార్టీని నాశనం చేస్తున్నారని, ఇది సరిపోనట్టుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కూడా పార్టీకి దూరం చేస్తారా.. ప్రజల్లో పార్టీని పలుచన చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ వివాదాలతో అసలు పార్టీని ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని నిలదీసినట్టుగా తెలిసింది. ఒక మహిళా మంత్రి అయి ఉండి..సాటి మహిళలపై అంత అసభ్యకరంగా, సంస్కారరహితంగా మాట్లాడటమేమిటని ప్రశ్నించారని, వ్యక్తిత్వంలేని వాళ్లను కేబినెట్లోకి ఎలా తీసుకున్నారని మండిపడ్డారని సమాచారం.