వికారాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘లగచర్ల భూములనే తీసుకుంటానని తిరుపతిరెడ్డి అనడమేంటి? ఇది ఆయన తాత జాగీరు కాదు. మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి’ అని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిపై వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. గిరిజన రైతుల నుంచి భూములను బలవంతంగా గుంజుకుంటామన్న తిరుపతిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఒప్పుకోకపోతే వేరేచోట ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిరెడ్డి దాదాగిరితో కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి నష్టం జరుగుతుందని, కానీ సీఎం ఇంకా కండ్లు తెరవడం లేదని అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్లీ ఇంటికి పంపిచడం ఖాయం.
తండాల మీద తిరుపతిరెడ్డి చూపిస్తున్న ఆధిపత్యం, ఆక్రమణలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు బయటకు వచ్చిన రోజు కాంగ్రెస్ నాయకుల కార్లు బయట తిరగవు. ఇది మీ ఇంటి విషయం కాదు. మీ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో తన్నుకోండి, అన్నదమ్ములు ఏమైనా చేసుకోండి. అంతేకాని బయటకొచ్చి ప్రజలపై దౌర్జన్యం చేస్తామంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అదే జరిగితే చూస్తు ఊరుకోం. రేవంత్‌రెడ్డి మొన్న ఒక పార్టీలో, నిన్న ఒక పార్టీలో ఉన్నారు. ఈ రోజు మా పార్టీలో సీఎం అయ్యారు.
రేపు ఇంకో పార్టీలోకి పోవచ్చు. కానీ కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందంటే ఊరుకోం. తిరుపతిరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ దృష్టికి తీసుకుపోతాం. చిన్న ఎలుక కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకోలేం’ అని అన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేదా? కడుపునకు అన్నం తింటలేడా? తిరుపతిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలు తిరగబడి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తే రేవంత్‌రెడ్డి సీఎం పదవి ఏం కావాలి? అని కాంగ్రెస్ నేత రాజశేఖర్ ప్రశ్నించారు.