హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ‘గోల్మాల్ గోవిందం’ తరహా లో ఉన్నది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు ఇంకా గవర్నర్ వద్దనే ఉన్నాయి.. వాటిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. చట్టంగా మారలేదు. ఆ బిల్లుల అమలు కోసం ప్రభుత్వం కూడా ఎలాంటి జీవో తీసుకురాలేదు.
కానీ, ఆ బిల్లులను ఆమోదించాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందని బీసీ మేధావులు, కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ‘బిల్లులు చేశాం. బాధ్యత తీరింది. కేంద్రం ఆమోదిస్తే అమలు చేస్తాం’ అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థలతోపాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించా ల్సి ఉన్నది. అవి చట్టంగా మారాక ప్రభుత్వం అమలులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
న్యాయపరమైన సవాళ్లు ఎదురైతే కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరి ఆమోదముద్ర వేయించుకోవాలి. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. పెంచిన బీసీ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురాకుండానే వాటిని ఆమోదించాలంటూ ఢిల్లీలో ధర్నా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుకూల బీసీ సంఘాలను ముందుంచి కేంద్రంపై నెపం నెట్టడం ద్వారా తప్పించుకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఎత్తులు వేస్తున్నదని వారు మండిపడుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలన్నీ మద్దతు పలకడంతోపాటు అవసరమైతే ఢిల్లీకి కూడా వస్తామని ప్రకటించాయి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని ప్రభుత్వ పెద్దలు కూడా అసెంబ్లీ వేదికగా ప్రగల్భాలు పలికారు. కానీ, ఆ బిల్లులు చట్టంగా మారకముందే కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆ ధర్నా అట్టర్‌ఫ్లాప్ అయింది. ఆ ధర్నాకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం కొద్దిమంది బీసీ సంఘం నేతలనే ఆహ్వానించారు. దీంతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కొందరు మంత్రులు, మిత్రపక్షమైన సీపీఐ నుంచి నారాయణ తప్ప ఎవరూ హాజరు కాలేదు. బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ మేధావులు కూడా పాల్గొనలేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కూడా ఆ ధర్నావైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుల అమలుకు రాష్ట్ర ప్రభు త్వం గవర్నర్‌తో ఆమోదింపజేసుకోకుండానే ధర్నాల పేరిట రాజకీయం చేస్తన్నదని, తద్వారా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ధ్వజమెత్తారు. కులగణన, రిజర్వేషన్ల పెంపునకు బీసీలు సాగిస్తున్నది ధర్మపోరాటమేనని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.