హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 51వ సారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరారు. మూడ్రోజులపాటు అక్కడే ఉండనున్నట్టు తెలిసింది. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఆ బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు(బుధవారం)ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జునఖర్గే, తెలంగాణ కాం గ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొననున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల నుంచి ముఖ్యనాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బిల్లులను ఆమోదించాలని వినతిపత్రం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇదిలా ఉండగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన బిల్లులను చర్చించి, ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.