Congress Govt | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం పెట్టుబడుల పేరిట ప్రకటిస్తున్న కంపెనీలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రఖ్యాత కంపెనీలను మాత్రమే ప్రభుత్వాలు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ర్టాలకు ఆహ్వానిస్తాయి. దానికి భిన్నంగా.. నిన్నమొన్న ఏర్పాటు చేసిన అనామక కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొంటున్నది.
షేర్ క్యాపిటల్ లక్షల్లో కూడా లేని కంపెనీలు.. రూ. వేల కోట్లు పెట్టుబడులను పెట్టబోతున్నట్టు ఊదరగొడుతున్నది. ఇదే ప్రజల్లో సందేహాలు పెరుగడానికి కారణమైంది. ముఖ్యంగా సీఎం సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయోగ్రీన్‌తో సర్కారు ఒప్పందం చేసుకోవడం, ఆ కంపెనీ వివరాలను మార్చేసి మరో కంపెనీగా సీఎం కార్యాలయం చిత్రీకరించడం, 17 రోజుల కిందటే ఏర్పడిన కంపెనీ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులను పెడుతామని సర్కారుతో ఒప్పందం చేసుకోవడం.. పెను దుమారానికి దారితీసింది.
బోగస్ కంపెనీలతో సర్కారు ఒప్పందాలు చేసుకున్నటున్నదని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. పరువు కాపాడుకోవడానికి సర్కారు.. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ వంటి ఐఏఎస్‌లతో ప్రకటనలను గుప్పిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో అమెరికా పర్యటన సజావుగా సాగుతున్నదని, ఒప్పందాలు, మీటింగ్‌లపై అపోహలేమీ పెట్టుకోవద్దని జయేశ్‌రంజన్ వివరణ ఇవ్వడమే దీనికి రుజువు.
సీఎం రేవంత్ సోదరుడికి చెందిన స్వచ్ఛ్ బయోగ్రీన్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నది. ఆ వివరాలను దాచిపెట్టిన సీఎంవో.. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్’ స్థానంలో ‘స్వచ్ఛ్‌బయో’ అనే అసలు ఉనికిలోనే లేని కంపెనీని తెరమీదకు తీసుకొచ్చి, ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నట్టు వెల్లడించింది. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన సీఎంవో అరకొర వివరాలతో సమాచారాన్ని ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెట్టుబడుల ప్రక్రియలో తప్పులు జరుగకుంటే సీఎంవో ఎందుకు నిజమైన కంపెనీల పేర్లను వెల్లడించడంలేదని ప్రశ్నిస్తున్నారు.
‘తమ్ముడి పెట్టుబడి.. అన్న అగ్రిమెంట్’ పేరుతో ‘స్వచ్ఛ్‌బయో’ కంపెనీ వెనకున్న చీకటి కోణాన్ని గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో బయటపెట్టింది. ఈ కథనంపై నెట్టింట పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ క్లిపింగ్స్‌ను సోషల్‌మీడియాలో పలువురు వైరల్ చేశారు. పెట్టుబడులపై రేవంత్ ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను కామెంట్ల రూపంలో ఎండగట్టారు.
భీమదేవరపల్లి, ఆగస్టు8: తెలంగాణ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ వెళ్లారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా అమెరికాకు వెళ్తే బీఆర్ఎస్ నేతలకు కండ్లు మండుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే అమెరికాకు వెళ్లారని తెలిపారు. ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి దేశ ఎల్లలు దాటి వెళ్తే కుటుంబపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ చులకన చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు వేరు కాదని, ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలిపారు.