హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలకు బఫర్‌స్టాక్ లేకపోవడమే కారణమా? బఫర్‌స్టాక్ నిల్వ చేయడంలో వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం వహించారా? సర్కారు ఆదేశాలతో బఫర్‌స్టాక్‌లో కోత పెట్టారా? తెలంగాణకు వచ్చిన యూరియా రేకులను ఇతర రాష్ర్టాలకు తరలించారా? ఇదే ఇప్పుడు కొంపముంచిందా? అంటే అవుననే అంటున్నాయి వ్యవసాయ, మార్క్‌ఫెడ్ వర్గాలు. రైతులకు యూరియా కొరత రావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు ముందస్తుగా యూరియా బఫర్‌స్టాక్ (ముందస్తు నిల్వ)ను నిల్వ చేసేది. సీజన్ ప్రారంభానికి ముందు ఒక్క మార్క్‌ఫెడ్ వద్దే కనీసం 3,4 లక్షల టన్నుల యూరియా బఫర్ ఉంచేవారు. ఇది కాకుండా ప్రైవేటు ఏజెన్సీల వద్ద మరో 2 లక్షల టన్నులు ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఈ విధంగా సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం సుమారు 5 లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ ఉండేలా ప్రణాళిక రూపొందించి నిల్వ చేసేవారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి యూరియా రావడం ఆలస్యమైనా, ఇతర కారణాలతో కొరత ఏర్పడినా ఈ బఫర్‌స్టాక్ నుంచి రైతులకు పంపిణీ చేసి కొరతను అధిగమించేవారు. కానీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్క్‌ఫెడ్ వద్ద యూరియా బఫర్‌స్టాక్ నిండుకుంది. 3 లక్షల టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్‌స్టాక్ 12వేల టన్నులకు పడిపోయింది. గత యాసంగి సీజన్ తర్వాత ఒక దశలో బఫర్‌స్టాక్ నిల్వలు దాదాపుగా జీరో అయినట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టినట్టు సమాచారం. దీంతో వచ్చిన స్టాక్ వచ్చినట్టు రోజువారీగా ఊడ్చి పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బఫర్‌స్టాక్ సంగతి దేవుడెరుగు రోజువారీ కావాల్సిన యూరియా సరఫరా చేయడమే గగనంగా మారింది.
ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయినట్టు మార్క్‌ఫెడ్ వద్ద యూరియా నిల్వలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 904 ప్యాక్స్‌లు, 350 హాకా, డీసీఎంఎస్ కేంద్రాలకు యూరియా సరఫరా చేసే మార్క్‌ఫెడ్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ కేవలం 12,827 టన్నులు మాత్రమే. మామూలుగా పంపిణీ చేస్తే ఇది ఒకే ఒక్క రోజులో ఖాళీ అయిపోతుంది. ఇక రాష్ట్రం మొత్తంలో ఈ నెల 21వ తేదీ వరకు ఉన్న యూరియా నిల్వ కేవలం 52,294 టన్నులు మాత్రమే. ఇందులో ప్రైవేటు వ్యాపారుల వద్ద 26,526 టన్నులు, సొసైటీల వద్ద 12,579 టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 12,827 టన్నులు, కంపెనీ గోదాముల్లో 362 టన్నులు ఉంది.
యూరియా బఫర్‌స్టాక్ నిర్వహించాలంటే ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. ముందస్తుగా కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేయాలి. ఇందుకు అయిన ఆర్థిక భారాన్ని కనీసం నాలుగైదు నెలల పాటు మోయాలి. కనీసం 3 లక్షల టన్నుల యూరియాను బఫర్‌స్టాక్ పెట్టాలంటే ప్రభుత్వం ముందస్తుగా రూ. 1,500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో కేసీఆర్ సర్కా రు ఈ ఆర్థిక భారాన్ని భరించి యూరియాను బఫర్‌స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బఫర్‌స్టాక్ వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో కోత పెట్టాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్టు మార్క్‌ఫెడ్ వ ర్గాలు తెలిపాయి. దీంతో అధికారులు సైతం ఇందుకు అనుగుణంగా బఫర్‌స్టాక్‌ను తగ్గిస్తూ వచ్చినట్టు తెలిసింది. బఫర్‌స్టాక్ తగ్గింపులో భాగంగా అధికారులు తెలంగాణకు వచ్చిన యూరియా రేకులను కూడా దించుకోలేదని తెలిసింది. దీంతో ఆ యూరియా రేకులను కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలించినట్టు గతంలో మార్క్‌ఫెడ్‌లో చర్చ జరిగింది. బఫర్‌స్టాక్ తగ్గించిన పాపానికి రెండు సీజన్లుగా యూరియా కొరత తీవ్రమైంది. ఓవైపు బఫర్‌స్టాక్ లేకపోవడం, మరోవైపు రావాల్సిన యూరియా రాకపోవడంతో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
సర్కారు బాధ్యతారాహిత్యం రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి ముందు జాగ్రత్తగా బఫర్‌స్టాక్ మెయింటెన్ చేస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి నిర్లక్ష్యమే రైతులను ఇప్పుడు గోస పుచ్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
యూరియా బఫర్‌స్టాక్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఒకవేళ గతంలో మాదిరిగా బఫర్‌స్టాక్ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రస్తుతం ఉన్నదానితో మేనేజ్ చేస్తున్నాం. సీజన్ ప్రారంభంలో కొంతమేర బఫర్‌స్టాక్ ఉన్నప్పటికీ షిప్‌ల ఆలస్యంతో క్రమంగా తగ్గుతూ వచ్చింది.