హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాతో కలిపేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఎజెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ రజతోత్సవ సభ జరుపుకుంటుంటే.. తెలంగాణలోని ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం కండ్లు మండుతున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రసంగం వినాలని ఎల్కతుర్తికి తండోపతండాలుగా జనాలు తరలివస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. టీఆర్ఎస్ సభనా? బీఆర్ఎస్ సభనా? అంటూ కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని, మరి ఇప్పుడున్న కాంగ్రెస్.. పాత కాంగ్రెస్ ఒక్కటేనా? అంటూ ప్రశ్నించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకు జాతీయ కాంగ్రెస్‌లో ఉన్నారా? ఇందిరా కాంగ్రెస్‌లో ఉన్నారా? అని సందేహం వ్యక్తంచేశారు. కేసీఆర్ తన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని మరో కాంగ్రెస్ నేత అంటున్నారని, అట్లయితే రేవంత్‌రెడ్డి తన సీఎం పదవి నుంచి తప్పుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. జై సోనియా అని అంటున్న కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అని ఎందుకు అనడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణపై ఎప్పుడూ ప్రేమ లేదని విమర్శించారు.