హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా విమర్శించారు. రాజ్ పాకాల ఇంట్లో తలపెట్టిన ప్లాన్ విఫలంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని నిర్వహించిన ఈ-కార్ రేస్‌పై ఏసీబీ విచారణకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదేశించినట్టు ఆరోపించారు. కేటీఆర్‌ను ఇరుకునపెట్టాలని, అబద్ధాలు చెప్పించి అయినా అరెస్టు చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఏ విచారణకైనా, జైలుకు వెళ్లేందుకైనా కేటీఆర్ సిద్ధమేనని.. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకడుగు వేయబోరని స్పష్టంచేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. దక్షిణకొరియా పర్యటనలో మంత్రి పొంగులేటి చెప్పిన బాంబులు ఇవేనా? అని మండిపడ్డారు. మూడ్రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. కుటుంబసభ్యులతో కలిసి దావత్ చేసుకుంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలా? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ నిలదీశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన కేసీఆర్ కుటుంబంపై ప్రతీకారాలు తీర్చుకునేందుకా అధికారమిచ్చింది? అని ప్రశ్నించారు. అభాండాలు, కుట్రలు చేస్తామంటే ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఫంక్షన్లు చేస్తే పోలీసులు ఇలాగే దాడులు చేస్తారా? అని నిలదీశారు.