Double Bedroom Houses | భద్రాచలం, డిసెంబర్ 15: ‘సొమ్మొకరికిది.. సోకొకరిది’ అనే నానుడికి కరెక్టుగా సరిపోయేలా భద్రాచలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించి భద్రాచలానికి 88 ఇండ్లను కేటాయించారు. ఏఎంసీ కాలనీలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున వెచ్చించారు. ఆ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2018 తరువాత మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. పట్టణానికి రెండో విడత 250 ఇండ్లను కేటాయించారు. ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షల చొప్పున రూ.12 కోట్ల నిధులను వెచ్చించారు.
మనుబోతులగూడెం, ఏఎంసీ కాలనీల్లో వీటిని ప్రారంభించారు. ఇందులో 117 ఇండ్లను పూర్తిచేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేలోపే 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ ఇండ్లను ఖాతాలో వేసుకోవాలని స్కెచ్ వేసింది. శనివారం 111 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఆ ఇండ్లకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగులను వేసి, తమ ప్రభుత్వమే కట్టించి ఇచ్చిందని కలరింగ్ ఇచ్చింది. నిజానికి ఈ 250 ఇళ్లకు రూ.12 కోట్ల నిధులను కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వాటిలో మరో 133 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పాలకుల తీరుపై లబ్ధిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.