హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తేతెలంగాణ) : కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశం మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్నది. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందజేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నాలుగు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై కూ డా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు.