Congress | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): ‘మేం అధికారంలోకి వస్తే రాష్ట్ర గతిని మార్చేస్తాం’.. అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎడాపెడా హామీలు గుప్పించింది. ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టింది. వాటికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కా ర్యదర్శి ప్రియాంకగాంధీ మద్దతు పలికారు. వాటిని అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హామీలు అటకెక్కాయి. అప్పుడు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదికి చేరువవుతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు. దగ్గరుండి అమలు చేయిస్తామన్న హైకమాండ్ పెద్దలు ఇప్పుడు నోరు విప్పడం లేదు. ఫలితంగా తెలంగాణ ప్రజల పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా మారింది.
పది క్యాబినెట్ భేటీలు ముగిసినా..
2023 సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా తు క్కుగూడలో నిర్వహించిన ‘కాంగ్రెస్ విజయభేరి’ బహిరంగ సభకు సోనియా, రాహుల్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఆరు గ్యారెంటీలు హామీ ఇస్తు న్నాం. అందులో మహాలక్ష్మి పథకం మొదటి ది. నేను హామీ ఇస్తున్నాను. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2,500 అంది స్తాం’ అని సోనియాగాంధీ హామీ ఇచ్చారు. ‘కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం. తొలి క్యాబినెట్ భేటీలోనే వాటిని ఆమోదించి ఇచ్చి న హామీ నిలబెట్టుకున్నాం. ఇక్కడ కూడా అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ భేటీలోనే వాటిని ఆమోదిస్తాం’ అని రాహుల్‌గాంధీ చె ప్పుకొచ్చారు. ఇప్పటికే పది క్యాబినెట్ భేటీలు జరిగాయి. ఒకటీ అరా తప్ప ఇచ్చిన హామీలు ఇచ్చినట్టే ఉన్నాయి. ప్రజలు మాత్రం ఇంకా ఆశగా హామీల కోసం కండ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
దుమారం రేపిన ఖర్గే వ్యాఖ్యలు
పార్టీ నేతలతో ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపా యి. ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇవ్వాలని, హామీ లు ఇచ్చే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఖర్గే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రజలు మండిపడ్డారు. హామీ లు గుప్పించినప్పుడు ఈ విషయం తెలియ దా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిందా? అని మండిపడుతున్నారు. రాహుల్‌గాంధీ ఆరు గ్యాంరెటీల కార్డు చూపించిననాడు, సోనియాగాంధీ మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించిననాడు అదే వేదిక మీద ఉన్న ఖర్గే అది తప్పు అని ఎందుకు చెప్పలేద ని నిలదీస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు మించి హామీలు ఉన్నప్పుడు అవి అమలు చేయాలం టే ఖజానా సరిపోదని తెలిసినప్పుడు వాటిని ఎలా ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్ లేనప్పుడు, మూసీ ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అగ్రనేతలు పెదవి విప్పడం లేదెందుకు?
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా, అడ్డగోలు హామీలు ఇవ్వడం తప్పని ఖర్గే బహిరంగంగానే చెప్పినా రాహుల్, సోనియా, ప్రియాంకగాంధీ ఎందుకు పెదవి విప్పడం లేద న్న ప్రశ్న అందరినీ వేధిస్తున్నది. కాంగ్రెస్ ఇప్పటికైనా తప్పు తెలుసుకోవడం మంచి కే అయిందని అంటున్నారు. కేసీఆర్ తమకు అన్నీ చేసిండని, కాంగ్రెస్ ఇంకేదో చేస్తుందని ఆశపడి అసలుకే మోసపోయామని ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ప్రతినెల రూ. 2,500 ఇస్తామని స్వయంగా సోనియా చెప్పడం, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించడంతో నమ్మి ఓట్లేశామని, కానీ అధికారంలోకి వచ్చాక ఇంత మోసం చేస్తారని అనుకోలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
సార్..సివిల్ కాంట్రాక్టు ప్లీజ్
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఇప్పుడున్న 23% నుంచి 42%కి పెంచుతాం. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని 10 నవంబర్ 2023న, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ లో ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ కూడా ఓ కారణం. బీసీ సంక్షేమం కోసం అదే వేదిక నుంచి 65 హమీ లు ఇచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. ఏ ఒక్క బీసీకి సివిల్ కాంట్రాక్ట్ దక్కలేదు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెం ట్, స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వడ్డీ రహిత రుణాలని చెప్పారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సబ్‌ప్లాన్‌కు హామీ ఇచ్చారు. రూ.50 కోట్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్య భవన్లు నిర్మిస్తామని, వాటిలోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌లో చెప్పారు. ఇప్పటి వరకు అవి అమలుకు నోచుకోలేదు.
సోనియమ్మ రాజ్యంలో రుణమాఫీ ఏది?
సోనియమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 13వేల పెట్టుబడి సాయం చేస్తామని 7 మే 2022న వరంగల్ రైతు సంఘర్షణ సభ లో రాహుల్‌గాంధీ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ పేరుతో 31 రైతు సంక్షేమ హామీలు ప్రకటించారు. సోనియమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చింది. కానీ రుణమాఫీ కాలేదు, ఇందిర మ్మ రైతుభరోసా ఊసేలేదు. రుణమాఫీ కోసం ఇంకా 22 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. మాఫీ కోసం ఇంకో 10 వేల కోట్లు అవసరం. కానీ రుణమాఫీ పూర్తి చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రబీ సీజన్ వచ్చినా.. ఇప్పటి వరకు రైతు భరోసా జాడ లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేకపోతున్నది. పాల ఉత్ప త్తి దారులకు లీటర్ మీద రూ. 5 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. అతి చిన్న హామీ అయినా.. దీనిని కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నది. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేసామని, జూన్ 2న ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆరు గ్యారెంటీలు హామీ ఇస్తున్నాం. అందులో మహాలక్ష్మి పథకం మొదటిది. నేను హామీ ఇస్తున్నాను. ఈ పథకం ద్వారా మహిళకు ప్రతి నెలా రూ. 2500 అందిస్తాం
-2023 సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభలో సోనియాగాంధీ
కర్ణాటలో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం. క్యాబినెట్ తొలి భేటీలోనే ఐదు గ్యారెంటీలు నిలబెట్టుకున్నాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలను తొలి క్యాబినెట్ భేటీలోనే అమలు చేస్తాం.
– రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారిని అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు రూ. 25 వేల గౌరవ పెన్షన్ అందిస్తాం. చదువుకునే ఆడపిల్లలకు ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ, రూ. 4000 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
-2023 మే 8న రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యూత్ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ