హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెద్దదిక్కు.. ప్రస్తుతం సీనియర్ మంత్రి.. ఉన్న మంత్రుల్లో కాస్త ఉత్తముడని, అధిష్ఠానానికి సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాల్లో పేరున్నది. కానీ..ముఖ్యనేత రాజకీయ ఉచ్చులో ఆయన కూడా చిక్కుకున్నారు. తనకు పోటీ వస్తారేమోనని భావించినవారిని అధిష్ఠానం ముందు అసమర్థులుగా చిత్రీకరిస్తున్న ఆ ముఖ్యనేత.. సదరు మంత్రిపైనా ‘బీఆర్ఎస్ కోవర్టు’ అనే ముద్ర వేశారట! ‘మీరు ఉత్తములు కారు’ అని ముఖంమీదే అన్నారట! అంతేకాకుండా వ్యతిరేక పార్టీలో తన అనుయాయుడిగా ఉండి.. అధికార పార్టీ వదిలి కేవలం ప్రతిపక్ష బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే ఓ ఎంపీని పురమాయించి మరీ ఆ మంత్రిపై ఆరోపణలు గుప్పించి అబాసుపాలు చేయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను, డాక్యుమెంట్లను బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారన్న ఆభియోగం సైతం మోపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యనేత వ్యవహారశైలితో కంగుతిన్న సదరు సీనియర్ మంత్రి, తనకు జరిగిన అవమానంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కాళేశ్వరమే ప్రధాన ఎజెండా అని ప్రభుత్వం లీకులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల కేంద్రంగా సమావేశం జరుగుతుందని ప్రచారం చేశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చను ఎజెండాలో కూడా చేర్చినట్టు సమాచారం. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేసుకున్నారని, దాదాపు ఐదారుగంటలు సచివాలయంలో వేచి చూశారని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. కానీ చివరి క్షణంలో ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారని విశ్వసనీయ సమాచారం. సమయాభావం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించలేదని ప్రచారం చేశారు. కానీ అసలు కారణం వేరే అని, సీనియర్ మంత్రి మీద అనుమానం వల్లే ఎజెండా నుంచి తొలిగించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మంత్రివర్గ సమావేశం ప్రారంభం కావడానికి గంట ముందు సీనియర్ మంత్రితో ముఖ్యనేత దాదాపు 45 నిమిషాలు భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఒకరికొకరు పరస్పర విరుద్ధ ఆరోపణలు చేసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ చేతికి వెళ్తున్నాయని, ఆయనకు చేరవేస్తున్న వారు ఎవరంటూ సీనియర్ మంత్రిని ముఖ్యనేత నిలదీసినట్టు తెలిసింది. మంత్రివర్గ సహచరుల్లో ఐక్యత లేకపోవటం వల్లే ప్రజల్లో ప్రభుత్వం చులకనైపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు మనం సహకరిస్తున్నాం కాబట్టే కాళేశ్వరం కమిషన్ విచారణ అనుకున్న విధంగా సాగడం లేదు’ అని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘మనం ప్రతిపక్షాల మీద ఎక్కు పెట్టిన గన్నును.. వారు మన వైపే తిప్పి కాలుస్తున్నారు’ అని గట్టిగానే అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం దగ్గర ఇంత దారుణమైన పరిస్థితులు పెట్టుకొని కాళేశ్వరం మీద చర్చించినా ప్రయోజనం లేదని వాపోయినట్టు సమాచారం. అందుకే ఈ అంశాన్ని మంత్రివర్గ సమావేశం ఎజెండా నుంచి తొలిగిస్తున్నామని సదరు మంత్రి ముఖం మీదనే ముఖ్యనేత చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యనేత ఆరోపణలతో సదరు మంత్రి తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిసింది. గతంలోనూ ధాన్యం టెండర్లు, ఎగుమతుల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఏకంగా రూ.వేల కోట్ల కుంభకోణమంటూ ఢిల్లీ పెద్దలకు చేరవేశారని ఆవేదన వ్యక్తం చేశారట! తాజాగా తనపై కోవర్టు ముద్ర వేశారని వాపోయినట్టు సమాచారం. ముఖ్యనేత నుంచి ఊహించని ఆరోపణలు రావడంతో మంత్రి కాసేపు సైలెంట్‌గా ఉన్నా, ఆ తర్వాత ఘాటుగా బదులిచ్చినట్టు చెప్పుకొంటున్నారు. తాను నికార్సయిన కాంగ్రెస్ నేతనని, పదవుల కోసం పార్టీలు మారి రాలేదని ఎదురుదాడికి దిగినట్టు తెలిసింది. ‘ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చేంత ఖర్మ నాకేం పట్టలేదు.. మీలాంటి వాళ్లు ఈ పార్టీ కాకుంటే ఇంకో పార్టీకి వెళ్తారు.. నేను అలాంటివాడిని కాదు’ అని ఘూటుగానే బదులిచ్చినట్టు సమాచారం. లీకులు ఇచ్చినట్టు ఆధారాలు చూపించకపోతే తీవ్ర పరిణాలు తప్పవని హెచ్చరించినట్టు చర్చ జరుగుతున్నది. తనకు జరిగిన ఈ అవమానంపై ఆయన ఏకంగా ఏఐసీసీ పెద్దలకు, కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వ్యక్తిగతంగా సోనియాగాంధీకి లేఖ రాసినట్టు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. మొత్తంగా మంత్రివర్గం ఏర్పడినప్పుడు ఉత్తముడిగా పేరొందిన సదరు మంత్రి ఇప్పుడు ముఖ్యనేత అణచివేతతో ఉత్తర కుమారుడిలా మారిపోయారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.
ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నయి కాబట్టి.. కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఆ మంత్రి చేస్తున్న పని! ఇయ్యాల తెలంగాణ సెంటిమెంట్‌ను లేపుదామని బనకచర్లను ముందుకు తెచ్చి బీజేపీపై బురదజల్లుతున్నరు. అసలు తెలంగాణకు ఎన్ని నీళ్లు కావాలె? రిక్వైర్మెంట్ ఏంది? ప్రాజెక్టుల ప్రణాళికేంది? ఫండ్స్ ఏడికెళ్లి తెస్తరు? అనేదాని మీద ఆ మంత్రికి అవగాహనే లేదు.