జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను భ్రమల్లో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితే లేదు.
Congress | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతకు మొండి చెయ్యి చూపనున్నదా? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరి నుంచి తప్పించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎత్తువేశారా? అక్కడి ముస్లిం ఓట్లకోసమే ఈ డ్రామాకు తెరతీశారా? అనే ప్రశ్నలకు న్యాయ, రాజకీయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎందుకంటే ఆయనతో పాటు కోదండరాం ఎంపిక రాజ్యాంగ విధానాలకు వ్యతిరకమనే వాదన వినిపిస్తున్నది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రు సత్యనారాయణ ఎంపిక కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. వారికి రాజకీయ నేపథ్యమున్నందున ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అమీర్‌అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను నామినేట్ చేస్తూ గవర్నర్ వద్దకు పంపించారు.
అమీర్‌అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌తో పాటు కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆగస్టు 30న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో రాజకీయ నేపథ్యమున్నదనే కారణంతో దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని 2024 జనవరి 17న అప్పటి గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ తిరస్కరించారు. దీనిపై వీరు హైకోర్టుకు వెళ్లారు. అయినా గవర్నర్ ఆమోదించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ అమీర్‌అలీఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా వారి ఎన్నిక చెల్లదని, తుదీతీర్పు అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
రాజకీయ నేపథ్యం, మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్‌సీఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌కు కూడా ఎమ్మెల్సీగా చుక్కెదురు తప్పదని న్యాయకోవిదులు చెప్తున్నారు. ఆయ న యూపీలో మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే కోదండరాం కూడా తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఎంపిక సుప్రీంకోర్టులో నిలబడడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే గవర్నర్ ఈ ఫైల్‌ను 20 రోజులుగా పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు.
మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో లబ్ధిపొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్టు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేగాని అజారుద్దీన్‌పై ప్రేమతోకాదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో షబ్బీర్‌అలీని నిజామాబాద్ నుంచి పోటీ చేయించి.. నమ్మించి గోంతుకోశారని, అమీర్అలీఖాన్ను కూడా ఇదే తరహాలో మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్‌కు మొండి చెయ్యి చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో తిరిగి బరిలో నిలువాలని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. అవసరమైతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆశచూపారని పేర్కొంటున్నారు.