KCR | ఖలీల్వాడి, జూలై 8: కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండె. ఐదో తారీఖు కల్లా పింఛన్లు అచ్చేటివి. ఇప్పుడు అట్ల అత్తలేవు. కాంగ్రెసోళ్ల మాయ మాటలకు మోసపోయి ఓట్లేసి గెలిపిస్తే ఏం సక్కగున్నదని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రికి చెందిన సునీత విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రం లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బీడీ కార్మికుల ధర్నాకు వచ్చిన ఆమెను విలేకరులు పలుకరించగా తన ఆవేదనను వెలిబుచ్చారు.
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయామన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి మహిళలను మోసం చేసిండు’ అని అన్నారు. ఫ్రీ బస్ కావాలని ఎవరన్న అడిగిండ్రా..? బస్సులో భర్తలు నిలబడితే భార్యలు కూర్చోవాల్నా? అని వ్యాఖ్యానించారు. ఫ్రీ కరెంట్ వచ్చినోళ్లు సంతోషపడుతున్నారు. రానివాళ్లు కన్నీళ్లు పెడుతున్నారని చెప్పారు. రూ.4 వేల పింఛన్ ఇప్పుడెస్తారో చెప్పాలని నిలదీశారు.