Congress | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ప్రజలకిచ్చిన హామీల అమలు చేయలేక, ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ వైఫల్యాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెడుతూ గులాబీ పార్టీ నేతలపై దుష్ప్రచారానికి దిగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దల కనుసన్నల్లో రెచ్చిపోతున్న ‘స్పెషల్ టీం’.. మీడియా విలువలకు తిలోదకాలిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో గందరగోళానికి తెరలేపుతున్నదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. నిత్యం ఏదో ఒక అసత్య కథనాన్ని వండివార్చి జనంలోకి వదులుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఓ వైపు సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై ఫేక్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మరోవైపు ప్రజల వాణిని ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఇతరుల సామాజిక మాధ్యమాలపై కక్ష సాధిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించినా, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను స్టేటస్‌గా పెట్టుకున్నా, వాట్సాప్, ఇన్‌స్టా, ఎక్స్‌లో షేర్ చేసినా.. వారిని వెతికి, వెంటాడి మరీ కేసులు కడుతున్నట్టు తెలిసింది. పోలీసులను అడ్డంపెట్టుకొని సర్కారును నడుపుతూ.. ప్రశ్నించే వారి గొంతునొక్కుతూ ‘ప్రజాపాలన’కు కొత్త అర్థం చెబుతున్నదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తరచూ విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తూ.. మహిళా జర్నలిస్టులను కూడా విచక్షణ లేకుండా జైళ్లకు పంపిందని మండిపడుతున్నారు.
అధికార పార్టీ ఆఫీసులోనే సోషల్ మీడియా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ ముఖ్యనేతలపై దుష్ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫేక్ క్లిప్పింగ్స్ సృష్టించి ప్రజల్లోకి పంపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారని, లేదంటే బీజేపీలో చేరతారని దేశంలోని ప్రముఖ చానళ్ల లోగోలు, పత్రికల మాస్ట్హెడ్లతో క్లిప్పింగ్స్ రూపొందించి జనంలోకి పంపుతున్నది. సర్కారు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేకే తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై విరుచుకుపడుతున్న సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ నాయకులను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిసింది. పైగా తమపైనే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా హాస్టల్లో నీళ్లు రావడంలేదని, హెచ్‌సీయూ పరిసరాల్లో జింకలు మరణించాయని, హైడ్రా బాధితుల ఆర్తనాదాలు, మూసీ బాధితుల కన్నీటి బాధలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మన్నె క్రిశాంక్‌పై 28 కేసులు నమోదు చేశారు. అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొణతం దీలిప్పై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. విచారణ పేరిట కొన్ని నెలలపాటు జైళ్లో నిర్బంధించారు. సామాన్యుల వాణిని బలంగా వినిపించిన యూట్యూబ్ జర్నలిస్టులు రేవతి, శంకర్ తదితరులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ తప్పుడు పోస్టులు పెట్టిన కాంగ్రెస్ నేతలను మాత్రం వెనుకేసుకొస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆధారాలతో సహా గచ్చిబౌలి, బంజారాహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాజాగా హరీశ్‌రావుపై ఫేక్ క్లిప్పింగ్స్‌తో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో నాయకులు గచ్చిబౌలి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు నచ్చజెప్పి పంపించారు తప్ప కేసు నమోదు చేయలేదని నాయకులు ఆరోపించారు. ఇక తమకు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవాలని లేదంటే భవిష్యత్తులో తగిన బుద్ధిచెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.