హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పెండింగ్‌లో పెట్టిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ వలీలుల్లా పేర్లను అధికారికంగా ప్రకటిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. వీటితోపాటు త్వరలో ఉప ఎన్నికల జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ఖరారు చేసినట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థులుగా ఎంపికైన ఆ ముగ్గురూ ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. కాగా కరీంనగర్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కూడా బుధవారం తన నామినేషన్ దాఖలు చేయడం ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నది. వెలిచాల రాజేందర్రావుకు పార్టీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ ఉసంహరించుకుంటారా? తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఖమ్మం టికెట్ కోసం చివరి వరకు గట్టిగా ప్రయత్నించిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సతీమణి నందిని కూడా గురువారం నామినేషన్ దాఖలు చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. ‘మన నందినమ్మకు తోడుగా ఖమ్మం పార్లమెంట్ ప్రజలు’ పేరుతో వెలువడిన ఈ పోస్టర్లలో భట్టి విక్రమార్క ఫొటో తప్ప, పార్టీ నాయకుల ఫొటోలు లేకపోవడంతో ఇది ఫేక్ పోస్టర్ అయి ఉండవచ్చని పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. భట్టి విక్రమార్క ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల తరఫున కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. అక్కడే ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి పేరు ఖరారు అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆ తర్వాతనే ఆయన కేరళలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లినట్టు భట్టి సన్నిహిత వర్గాల సమాచారం. కాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నందిని నామినేషన్ పోస్టర్లపై ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది.