పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కిందనే ఆయకట్టు ఉన్నది. అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కాల్వలకు సైతం టెండర్లు పిలిచి, భూసేకరణ మొదలుపెట్టారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రూ.9వేల కోట్ల విలువైన టెండర్లను రద్దు చేసి, పనులను అటకెక్కించింది. దీంతో 16 నెలలుగా తట్టెడు మట్టి పని కూడా జరగలేదు. ఒకవైపు పనులు ఆగిపోవడంతో ఆయకట్టుకు నీళ్లందకపోగా, మరోవైపు రూ.9వేల కోట్ల విలువైన పనుల అంచనా విలువ 16 నెలలు జాప్యం కావడంతో అదనంగా 10-15% అంటే సుమారు రూ.1,350 కోట్ల మేర పెరిగినట్టు అంచనా.(గుండాల కృష్ణ/మ్యాకం రవికుమార్)
Revanth Reddy | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): భూ సేకరణ సమస్యలు.. కోర్టు వివాదాలు.. గ్రీన్‌ట్రిబ్యునల్ చిక్కుముళ్లు.. ఇలా ఒకటేమిటి! పాలమూరు రైతాంగ తలరాతను మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎదుర్కొన్న బాలారిష్టాలు రాసుకుంటే రామాయణమంత! తాగునీటి కోసమేనని గ్రీన్‌ట్రిబ్యునల్‌కు నచ్చజెప్పుకొని, ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ క్లిష్టమైన సవాళ్లను సైతం అధిగమించిన కేసీఆర్ ప్రభుత్వం కృష్ణమ్మను ఎత్తిపోసింది. కానీ, ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లోపించింది. ఫలితంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కోటా కు మించి కృష్ణాజలాలను తరలించుకుపోతున్నా మరోవైపు పాలమూరు మోటర్లు మాత్రం ఆన్ కావడం లేదు. రిజర్వాయర్లలో నీటిని నింపుకునే వెసులుబాటు ఉన్నా, చిన్నపాటి పనులు పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వం తమాషా చూస్తున్నది.
ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టుతో కల్వకుర్తి ప్రాజెక్టు కింద రెండు లక్షల ఎకరాలకుపైగా స్థిరీకరణ చేసేందుకు అనుసంధాన తూములు ఉన్నప్పటికీ, నీటిని ఎత్తిపోయకపోవడంతో కల్వకుర్తి కింద సాగునీరు సరిపోక రైతాంగం అల్లాడిపోతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కాల్వలకు సైతం టెండర్లు పూర్తికాగా, అధికారంలోకి రాగానే రేవంత్ సర్కారు వాటిని రద్దు చేసింది. దీంతో, ఒకవైపు పొలాలకు అందాల్సిన సాగునీటికి మార్గం లేక, ఇటు ఏడాదికిపైగా జాప్యం కారణంగా అంచనా వ్యయం వెయ్యి కోట్లకుపైగా అదనంగా పెరిగిపోయింది. ఇలా పాలమూరును పక్కనబెట్టి, కల్వకుర్తిని ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ‘పాలమూరుకు మీరేం చేశారు?’ అంటూ బీఆర్ఎస్ను ఎదురు ప్రశ్నించడం ఓ విడ్డూరం.
నాడు కేసులు.. నేడు నిర్లక్ష్యం
పాత పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టుకున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు చెందిన నేతలు న్యాయస్థానాలు, గ్రీన్ట్రిబ్యునల్స్లో వేసిన కేసులతో ఆ చిక్కుముళ్లు విప్పేందుకే చాలాకాలం పట్టింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రాంతంలో పులుల సంచారానికి ఇబ్బందులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు గ్రీన్ట్రిబ్యునల్లో అడ్డుపుల్ల వేసి పనులు ముందుకు సాగకుండా తీవ్ర ప్రయత్నం చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆ సమస్యలను అధిగమించేందుకు అనేక పాట్లు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ, కేవలం తాగునీటి కోసమే పనులు చేపట్టాలంటూ గ్రీన్‌ట్రిబ్యునల్ ఆంక్షలు కొనసాగించింది. వీటన్నింటినీ ఎదుర్కొంటూనే కేసీఆర్ ప్రభుత్వం సింహభాగం పనులు పూర్తి చేసి, నీటి ఎత్తిపోతలు కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ వేగాన్ని కొనసాగించి ఉంటే, ఇప్పటికే ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు కల్వకుర్తి ప్రాజెక్టు కింద కూడా ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. కానీ, కేసీఆర్‌కు పేరు వస్తుందనే దుగ్దతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పనులను అటకెక్కించింది. పాలమూరును గోస పెడుతున్నది.
విద్యుత్తు కనెక్షన్ ఇచ్చే గతి లేదు
కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా 65.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఐదు రిజర్వాయర్ల పనులను దాదాపుగా పూర్తి చేసింది. ప్రాజెక్టులో నాలుగుచోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉన్నది. ఇందులో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే నార్లాపూర్ పంపుహౌజ్ వద్ద ఆసియాలోనే అతి పెద్ద సామర్థ్యం ఉన్న 145 మెగావాట్ల మోటర్లు ఎనిమిది ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఇందులో రెండు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఆ తర్వాత నిర్మాణమైన మరో మూడు పంపుహౌస్‌లలో నాలుగు చొప్పున మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఆయా పంపుహౌజ్‌ల పరిధిలో ఉన్న విద్యుత్తు సబ్స్టేషన్లకు కరెంటు సరఫరా ఇంకా ఇవ్వకపోవడంతో ఈ మోటర్ల డ్రైరన్ కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొన్నది. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గత 16 నెలల్లో గతంలోని పనుల వేగాన్ని కొనసాగించి ఉంటే, శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు జడ్చర్ల పరిధిలోని ఉద్దండాపూర్ వరకు పరుగులు పెట్టేవి. అదేవిధంగా కాల్వల పనుల టెండర్లు కూడా పూర్తయినందున భూసేకరణ పూర్తి చేసి, వాటి నిర్మాణాన్నీ చేపడితే దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలు ఇప్పుడు పచ్చని మాగాణంలా తయారయ్యేవి.
శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలను ఎత్తిపోసేందుకు నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 8.52 టీఎంసీలు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రెండు టీఎంసీల మేర నింపారు. ప్రొటోకాల్ ప్రకారం ఇప్పుడు మరో రెండు టీఎంసీలు నింపే అవకాశం ఉన్నది. తద్వారా నాలుగు టీఎంసీల కృష్ణాజలాలను ఇందులో నిల్వ చేసుకోవచ్చు. గతంలో నీటిని నింపడంతో ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి.
నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ నుంచి 6.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు వెళ్లేందుకు దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యాయి. కేవలం ప్యాకేజీ-3లో భాగంగా పెండింగ్‌లో ఉన్న సుమారు మూడున్నర కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలి. ఇక్కడ కూడా బ్యాంకింగ్ (రాతి నిర్మాణం) పనులు మాత్రమే చేపట్టాల్సి ఉన్నది. ఈ పనులు పూర్తయితే ఏదుల జలాశయంలో ప్రొటోకాల్ ప్రకారం రెండు, మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. తద్వారా చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్దీ బోర్లు, బావులు పుష్కలంగా నీరు పోసేవి.
ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్ వరకు నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కా ల్వ పనులు, 16.74 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న వట్టెం రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పంపుహౌజ్ వద్ద ఉన్న సబ్స్టేషన్లకు కరెంటు సరఫరాను ఇప్పిస్తే ఇక్కడ 4 టీఎంసీల కృష్ణాజలాలను నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నది. తద్వారా చుట్టూ భూగర్భజలాలకు జీవం వచ్చేది. కానీ, నార్లాపూర్-ఏదుల మధ్య కేవలం కొద్దిపనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మూడున్నర కిలోమీటర్ల పనులు అసంపూర్ణంగా ఉన్నందున ఇక్కడిదాకా నీళ్లు రావడం లేదు.
వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్ నుంచి 17.34 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న కరివెన (కురిమూర్తిరాయ) రిజర్వాయర్‌కు కూడా కృష్ణాజలాలను తరలించేందుకు పనులన్నీ పూర్తయ్యాయి. వీటి మధ్య జలాల తరలింపు గ్రావిటీ మీదనే ఉంటుంది. ఇప్పటికే కాల్వ పనులు పూర్తయిన నేపథ్యంలో వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌లో నీళ్లు నింపి, దిగువకు గేట్లు తెరిస్తే కృష్ణాజలాలు కరివెన వరకు పరుగులు తీస్తాయి. కానీ, నార్లాపూర్-ఏదుల మధ్య మూడున్నర కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇక్కడిదాకా నీళ్లు రావడం లేదు.
కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్ నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు కృష్ణాజలాలను తరలించాలి. ఇందుకుగాను ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా చాలా దూరం జలాలు గ్రావిటీపైనే ఉద్దండాపూర్ వైపు వస్తాయి. చివరలో మోటర్ల ద్వారా ఎత్తిపోయాలి. పంపుహౌజ్, మోటర్ల బిగింపు పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 75% వరకు పూర్తయ్యాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు రివిట్మెంట్ అంటే చివరి దశలో ఉన్నాయి. ఈ 16 నెలల్లో ఆ పనులు పూర్తి చేస్తే కృష్ణాజలాలు 16.03 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్‌లోకి వచ్చిపడతాయి. తద్వారా ఏనాడూ సాగునీటి మొహం చూడని ఈ ప్రాంతంలో మూడు టీఎంసీల జలాల నిల్వతో చుట్టూ కిలోమీటర్ల కొద్దీ భూగర్భజలాలు సమృద్ధిగా ఉండేవి.
3.5 కి.మీతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం
కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అంజనగిరి (నార్లాపూర్) నుంచి వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ మధ్య పెండింగులో ఉన్న మూడున్నర కిలోమీటర్ల అసంపూర్తి కాల్వ పనులను పూర్తి చేస్తే రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా దొరికేది. ఈ పనులను పూర్తి చేస్తే కృష్ణాజలాలు 4 రిజర్వాయర్లలోకి వచ్చేవి. తద్వారా ఆ రిజర్వాయర్ల చుట్టూ కిలోమీటర్ల మేర భూగర్భజలాలు సమృద్ధిగా ఉండేవి. వాటి పరిధిలోని బోర్లు, బావులు నిండు వేసవిలోనూ ఎండిపోకుండా ఉండి, రైతుల పంటలకు భరోసాగా నిలిచేవి. అంతేకాదు, రిజర్వాయర్లలో నీటి నిల్వతో కొత్తగా బోర్లు, బావులను నమ్ముకొని వేలాది ఎకరాల్లో పంటలు పండించుకునేవారు. దీంతో కల్వకుర్తి ఆయకట్టు స్థిరీకరణ జరిగేది.
వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో ఒక తూము ఏర్పాటు చేసింది. 350 క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జితో పూర్తి చేసిన ఈ తూము ద్వారా పాలమూరు-కల్వకుర్తి ప్రాజెక్టు మధ్య ఉన్న 50 వేల ఎకరాల ఆయకట్టు మొత్తం స్థిరీకరణ జరిగేది.
అదేవిధంగా వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఆయకట్టు స్థిరీకరణకు కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో తూము ఏర్పాటు చేసింది. 1,500 క్యూసెక్కుల డిశ్చార్జితో ఏర్పాటు చేసిన ఈ తూము ద్వారా రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న లక్షన్నర ఎకరాల ఆయకట్టు స్థిరకరణ జరిగేది.
సమైక్య వివక్షకు నిదర్శనంగా కల్వకుర్తి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయనేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా ఓ నిదర్శనం. టీడీపీ హయాంలో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల్లో తొలుత 2.2 లక్షల ఎకరాల ఆయకట్టును చూపారు. జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టి ఆయకట్టును 3.4 లక్షల ఎకరాలకు పెంచింది. అరకొర పనులతో చేతులెత్తేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిక్కుముళ్లు అన్నీ విప్పి ఏకంగా 40 టీఎంసీల కేటాయింపుతో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను ఆయకట్టును 4.6 లక్షలకు పెంచింది. గ్యాప్ ఆయకట్టు కూడా తోడవడంతో ఇప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టుపై ఏకంగా ఐదు లక్షల ఆయకట్టు భారం పడింది.
ఈ కొద్దిపాటి పని పూర్తి చేస్తే కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి కురుమూర్తిరాయ రిజర్వాయర్ వరకు (కరివెన) తరలివెళ్తాయి.ఆ మేరకు పనులన్నీ కేసీఆర్హయాంలోనే పూర్తయ్యాయి.
అంజనాద్రి రిజర్వాయర్ (నార్లాపూర్) నుంచివీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్‌కు నీళ్లను తరలించే హెడ్ రెగ్యులేటర్
ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే టెండర్లు పిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఇలా కాకుండా కాల్వలను పూర్తి చేసి ఉంటే దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్లు వచ్చేవి.
వీరాంజనేయ, వెంకటాద్రి రిజర్వాయర్లను కల్వకుర్తి ప్రధాన కాల్వతో అనుసంధానం చేశారు. ప్రస్తుతం కల్వకుర్తి కాల్వ సామర్థ్యం సరిపడా లేనందువల్ల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వలేక పోతుంది. ఇప్పటికే పనులు పూర్తి చేసి పాలమూరు రిజర్వాయర్లను గనుక నింపి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయి సిద్ధంగా ఉన్న ఈ కెనాల్ ద్వారా కల్వకుర్తి ప్రధాన కాల్వకు నీళ్లు తరలించే వీలుండేది. ఆయకట్టుకు భరోసా దక్కేది?
కక్షగట్ట్టి… పక్కనబెట్టి…
వెంకటాద్రి రిజర్వాయర్ కింద కాల్వల నిర్మాణానికి రూ.454.56 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. వీటిని కొనసాగించి ఉంటే నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.33 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందేది.కురుమూర్తిరాయ రిజర్వాయర్ కింద కాల్వల పనులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,469 కోట్లతో టెండర్లను పూర్తి చేసింది. ఇవే పనులు ముందుకు సాగి ఉంటే నాగర్‌కర్నూల్ జిల్లాలోని 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందే బృహత్తర కార్యక్రమం మొదలయ్యేది.
ఉద్దండాపూర్ కింద కాల్వల నిర్మాణానికి రూ.5,600 కోట్లతో టెండర్లు గతంలోనే పూర్తయ్యాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా పనులు ముందుకు తీసుకుపోతే… అసలు సాగునీరు అంటే తెలియని రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, వికారాబాద్‌లోని… మండలాల పరిధిలో ఉన్న ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందనే భరోసా వచ్చేది.