‘అది అటవీ ప్రాంతం.. మమ్మల్ని ఎవరేం చేస్తరు?’ అనుకున్నరు కాబోలు.. అమాయక ఆదివాసీ ఆడబిడ్డలపై అటవీశాఖ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించారు. రెండు రోజులక్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి అటవీ పరిధిలోని కొర్సాగుంపులో ఆటవిక చర్యకు దిగారు. మగవాళ్లెవరూ లేని సమయంలో ఆదివాసీ ఆడబిడ్డలు పోడు పొలంలో పత్తిగింజలు వేస్తుండగా.. ఆరుగురు అటవీశాఖ సిబ్బంది జేసీబీతో దిగబడ్డారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? మెషీన్ ఎందుకు తెచ్చిండ్రు’ అని ప్రశ్నించిన మహిళలపై అమానుషంగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. జుట్టు పట్టుకుని, జాకెట్లు చింపి మరీ దాడిచేశారు. ‘ఇది మా జాగ.. మీరెందుకు వచ్చారే’ అంటూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : అడవిమాటున బతికే ఆదివాసీ గిరిజనులపై ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘బుల్డోజర్ రాజ్’ను అమలు చేస్తుంటే మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆపరేషన్ కగార్ పేరిట వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రపంచానికి దూరంగా అడవుల్లో బతుకుతున్న అభాగ్యుల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ప్రజాపాలన అంటూనే అమాయక గిరిజనుల జీవనాధారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకొడుతున్నది. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి ట్రెంచ్ (కందకాల) పేరుతో అటవీ శాఖ అధికారులు బల్డోజర్లతో దిగబడి ఆయా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీనికి ఇటీవల జరిగిన బూర్గంపహాడ్ ఘటనే ఉదాహరణగా నిలిచింది.
ఇటీవల చుంచుపల్లి మండలం పెనగడపలోని తమ భూమిలో ట్రెంచ్ కొడుతున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి ఆదివాసీలు అడ్డుపడ్డారు. ఈ గొడవ కాస్తా పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. ఇది జరిగి వారం దాటక ముందే బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామం కొర్సాగుంపులో అటవీ శాఖ అధికారులు ఆదివాసీ గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో దవాఖాన పాలయ్యారు. పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో అటవీ సిబ్బంది గిరిజన మహిళలపై దాడి చేయడంతో ఓ మహిళ దుస్తులు చిరిగిపోయాయి.
ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటనపై బూర్గంపహాడ్ పోలీస్స్టేషన్లో ఆదివాసీలు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడిన ఆదివాసీలను భద్రాచలం దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. తమ భూముల్లో కందకాలు తీస్తున్న అధికారులను అడ్డుకున్నందుకు సిబ్బంది దాడి చేశారని, దుస్తులు చింపి దౌర్జన్యానికి పాల్పడ్డారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. 25 ఏండ్లుగా 100 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న తమను అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, జేసీబీతో వచ్చి దౌర్జన్యం చేయగా అడ్డుకున్న తమను దారుణంగా కొట్టారని వాపోయారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి గొడవలు, ఆందోళనలు లేకుండా గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో పంటలు పండించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబాలను పోషించుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు అందించి వారికి భూములపై హక్కులు కల్పించింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములను లాక్కునేందుకు తీరొక్క ప్రయత్నాలు చేస్తున్నదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట పోడు గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నట్టు చెప్తున్నాయి.
అమాయక ఆదివాసీ గిరిజన మహిళలపై దాడిచేసిన అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎవరూ లేని సమయంలో ఎవరికీ తెలియకుండా ట్రెంచ్ల పేరుతో అడవిలోకి వెళ్లి ఆదివాసీ ఆడబిడ్డలపై అరాచకం చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల బతుకులను ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆగం చేస్తున్నాయని మండిపడుతున్నాయి. ఇటు గిరిజనుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, అటు బీజేపీ సర్కారు ఆపరేషన్ కగార్ పేరిట అడవులను జల్లెడ పడుతుండటంతో గిరిజనులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దాడిలో గాయపడిన మహిళలకు సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సంఘీభావం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ గిరిజన మహిళలపై అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాడి చేయడం హేయమని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళలు అని కూడా చూడకుండా బట్టలు చింపేలా కొట్టడం ఎక్కడి సంస్కృతి అని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సింధు తపస్వి మండిపడ్డారు. ఈ ఘటనపై బూర్గంపహాడ్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. మహిళలపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా ట్విట్టర్ వేదికగా ఖండించారు. బాధితులను నేడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ నేతలతో కలిసి పరామర్శించనున్నారు.
బూర్గంపహాడ్, జూన్ 21 : అటవీ శాఖ సిబ్బంది దాడిలో గాయపడిన గిరిజన మహిళలు మడకం సునీత, మడకం నందిని, కుంజా జోగమ్మ, తాటి లక్ష్మి, శీలం చుక్కమ్మలను కొర్సాగుంపు గ్రామస్తులు 108 వాహనంలో భద్రాచలం ఏరియా దవాఖానకు శనివారం తరలించారు. వైద్యులు వారికి పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం నాటి దాడి ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. దీనిపై కొర్సాగుంపు గ్రామ పెద్ద కోసాను అడుగగా దాడిలో గాయపడిన మహిళలను ఏరియా దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నామని, బాధిత మహిళలతో కలిసి మరోసారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మేము పత్తిగింజలు వేస్తుంటే మిషిన్ పట్టుకొని వచ్చిండ్రు. ఇక్కడికి ఎందుకొచ్చిండ్రని అడిగిన. ఏంటే అని రెండు చేతులు పట్టుకొని ఈడ్చుకుపోయిండ్రు. బూటుకాళ్లతో తన్నిండ్రు. కొంతసేపు పెనుగులాడి తప్పించుకున్న. ఆడవాళ్లమని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. మా భూమిలో విత్తనా వేసుకుంటుంటే ఎవరూ లేని సమయంలో వచ్చి దాడి చేసిండ్రు.
-మడకం సునీత, కొర్సాగుంపు, ఇరవెండి గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం
భూమిలో గింజలు వేస్తుంటే వచ్చిండ్రు. మిషన్ ఎందుకు అనడిగితే కొట్టడానికి వచ్చిండ్రు. ఇంటికి ఉరుకుతుంటే నైటీ పట్టుకొని చింపిండ్రు. ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అందరం ఆడవాళ్లం ఉన్నం. మమ్మల్ని బూటుకాళ్లతో తన్ని బూతులు తిట్టిండ్రు. ఒకడైతే ప్యాంటు ఇప్పి చూపించిండు. మామ్మల్నే కొట్టి మా మీదనే కేసులు పెడుతున్నరు.
-కుంజా జోగమ్మ, కొర్సాగుంపు, ఇరవెండి గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అమాయక ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు రెచ్చిపోతున్నరు. ఆడబిడ్డలను వివస్త్రలను చేస్తరా? సిగ్గుండాలె.. ఆడవాళ్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ హయాంలో పోడు చేసిన వారందరికీ పట్టాలిచ్చి ఆదుకున్నం. కాంగ్రెస్ ప్రభుత్వం అడవిబిడ్డలపై దాడులు చేస్తున్నది. చేతకాకపోతే చేతులెత్తేయాలె గని ఇదేం పని? ఆడవాళ్లను బట్టలు చిరిగేలా కొట్టడమేంది? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటదా? దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నం.
– రేగా కాంతారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెలే
ఏండ్ల తరబడి పోడు సాగు చేసుకొని బతుకుతున్న ఆదివాసీలపై దాడులు చేయడం సరికాదు. అధికారులే గిరిజనుల దగ్గరకు వచ్చి సాగులో ఉన్న భూములకు రక్షణ కల్పించాలి. అమాయక ఆదివాసీలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు. అటవీ శాఖ అధికారులకు తగిన గుణపాఠం చెప్తాం. బడాబాబులు అడవిని నరుకుతుంటే చూస్తుంటారు.. కానీ ఆదివాసీలు తిండిగింజల కోసం సాగు చేస్తుంటే ఆడవాళ్లు అని కూడా చూడకుండా కొట్టడం ఎంతవరకు సబబు? ప్రజాపాలన అంటే ఇదేనా? ఎకరం, రెండెకరాలు సాగు చేసుకునే ఆదివాసీలపై అటవీ శాఖ పెత్తనం ఏమిటి?
-వాసం రామకృష్ణ. ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం